Revanth Reddy: సినీ పరిశ్రమకు పూర్తి సహకారం…. రేవంత్ రెడ్డి
టాలీవుడ్(Tollywood) కు చెందిన అనేక మంది ప్రముఖులు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మాతో పాటు తమకు సినిమా రంగం కూడా ముఖ్యమేనని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ సర్కార్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. సర్కార్ కు, ఇండస్ట్రీకి వారధిగా ఉండాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజును ఎఫ్ డీసీ ఛైర్మన్ గా నియమించామని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో సీరియస్‌గా ఉంటామని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని.. ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లు ఆ తర్వాత ముఖ్యమంత్రి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.













