2022 ని విజయవంతంగా ముగిస్తారా?
గత రెండేళ్లుగా కరోనా పాండెమిక్ కారణంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు మెల్లిగా ట్రాక్ లోకి వచ్చింది. ఎప్పటిలాగే వారం వారం సరికొత్త సినిమాల తో సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. 2022 లో ఇప్పటివరకు చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, మరికొన్ని హిట్స్ గా నిలిచాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేక ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి.
ప్రస్తుతం ఇయర్ ఎండింగ్ కి వచ్చిన నేపథ్యంలో, డిసెంబర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. సాధారణంగా డిసెంబర్ నెలను సినిమాలకి మంచి సీజన్ గా భావిస్తుంటారు. స్టార్ హీరోలు తమ సినిమాలు క్రిస్మస్ కి విడుదల చేయడానికి ఆసక్తి చూపించేవారు. గతేడాది “అఖండ” , “పుష్ప” ,”శ్యామ్ సింగరాయ్” వంటి సినిమాలు క్రిస్మస్ కి రిలీజై సందడి చేశాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం చిన్న, మీడియం రేంజ్ హీరోల సినిమాలే వస్తున్నాయి.
టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్ నటించిన “హిట్: ది సెకండ్ కేస్” డిసెంబర్ 2 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి.
డిసెంబర్ సెకండ్ వీక్ లో “పంచతంత్రం ” అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్ , రాహుల్ విజయ్ తదితరులు నటిస్తున్నారు. హర్ష పులిపాక డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నారు. ఇదే రోజు ” రాజయోగం” అనే సినిమా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధంగా ఉంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం “ధమాకా” క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటూ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “అవతార్-2 ” సినిమా డిసెంబర్ 16 న రిలీజ్ కానుంది. తెలుగుతో సహా ప్రపంచం లోని 150 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ” 18 పేజెస్ ” సినిమా కూడా డిసెంబర్ 23 న రిలీజ్ కానుంది. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడం కొసమెరుపు. “కార్తికేయ 2 ” తర్వాత రాబోతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
సుధీర్ బాబు నటిస్తున్న “హంట్ ” చిత్రాన్ని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కి రెడీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా , తేజ దర్శకత్వం లో వస్తున్న “అహింస ” చిత్రాన్నీ వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.













