కొంత ప్రతిష్ట కొంత లాభం కొంత నష్టం కొంత విషాదం కొంత వివాదం
కరోనా ఇంకా మన దేశాన్ని ఆవహించకముందు ప్రారంభించుకున్న సినిమాలన్నీ పూర్తి చేసుకుని గరిష్టంగా 2022లోనే విడుదల అయ్యాయి. ఎన్నో అంచనాలతో ఈ ఏడాది థియేటర్లలో, ఓటిటిలో చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో పాన్ ఇండియా మూవీస్, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలనుండి డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు తెలుగు వెబ్ సిరీస్ లతో వినోదానికి కొదవలేకుండా స్మాల్ బిగ్ స్క్రీన్స్ సందడి చేస్తున్నాయి. ఆ విధంగా 2022లో ప్రేక్షకుడు వినోదంతో తడిసి ముద్దయ్యాడు. అయితే 2022 విడుదల అయిన సినిమాలు సినీ పరిశ్రమకు లాభాల పంట పండిస్తే… మరి కొన్ని పోస్టర్ ఖర్చుల వసూలు చేయకుండా పరాజయాన్ని చవి చూశాయి. అయితే ఈ జయాపజయాలు సినిమా పరిశ్రమలో కొత్తేమి కాదు. మళ్ళీ సరికొత్త అంచనాలతో, కోటి ఆశలతో 2023లోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో సినిమా సందడి మొదలైంది. ముగ్గురు అగ్ర హీరోల రెండు భారీ చిత్రాలతో ఈ ఏడాది సంక్రాంతి ప్రచార జోరు ఊపందుకుంది. మరి గతేడాది సినిమా విశేషాలను సింహావలోకనం చేసుకుందాం.
– రాంబాబు వర్మ
దశ దిశలా తెలుగు సినిమా ప్రతిష్ట
ఈ ఏడాది తెలుగు సినిమా గ్లోబల్ మూవీగా ప్రసిద్ధికెక్కింది. కారణం భారీ బడ్జెట్‌తో, ఉత్తమ సాంకేతిక విలువలతో, తెలుగు సినిమా స్థాయి ఇది అని ప్రపంచవ్యాప్తంగా కొన్ని సినిమాలు చాటి చెప్పాయి. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్తో మొదలుకుని అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన భయానక చిత్రం ‘మసూద’ వరకు ప్రేక్షకులు ఆదరించారు. ఈ ఏడాదికి చిన్న పెద్ద నేరుగా తెలుగు సినిమాలు మొత్తం 220 వరకు విడుదలైతే…. 65 పైగా అనువాద చిత్రాలు మన ముందుకొచ్చాయి. అయితే 285 చిత్రాలలో కేవలం పది శాతం మాత్రమే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి.
పాన్ ఇండియా మూవీస్ 2022
ఈ ఏడాది ఏ సినిమా రంగాన్ని చూసిన పాన్ ఇండియా మూవీ అనే పదం పదే పదే వినిపిస్తున్న సౌండ్. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, చిత్రాలను నిర్మించే సంస్థలు టైటిల్ క్రింద హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అనే టాగ్‌లైన్‌తో జాతీయ స్థాయిని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించారు. అయితే ప్రయత్నం చేసినవారిలో కొందరు మాత్రమే సఫలీకృతం అయ్యారు. వాటిలో తెలుగులో నిర్మించిన స్ట్రెయిట్ చిత్రాలను పరిశీలిస్తే… ఆర్ఆర్ఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పరాజయం ఎరుగని ఎస్ఏస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీర్, రాంచరణ్, హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ, జాతీయ స్థాయిలో విజయాన్ని అందుకోగా.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో దేశాల ప్రశంసలందుకుంది. ఇటీవలే నాటు.. నాటు.. పాటతో ఆస్కార్ బరిలో షార్ట్ లిస్ట్‌లో నిలబడిరది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ నామినేషన్‌కు అర్హత సాధించింది. ఇంకా పలు అంతర్జాతీయ పురస్కారాలలో ఆర్ఆర్ఆర్ పేరు మారు మ్రోగింది. మేజర్, శ్రీ కృషుడి అవతార సమాప్తి నేపధ్యంలో తీసుకున్న మేజర్, కార్తికేయ 2, సీతా రామం చిత్రాలు కూడా జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని అందుకోగా.. రాధే శ్యామ్, లైగర్ చిత్రాలు పరాజయం పొందాయి. అయితే సాంకేతిక పరంగా రాధేశ్యామ్ చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి.
ఒమిక్రాన్ భయంతో సంక్రాంతి సినిమాలు నిల్
2021లో విడుదలైన పుష్ప, అఖండ తెలుగు సినీ పరిశ్రమకు ఊపిరి పోసిన చిత్రాలు. అయితే ఈ 2022 ఏడాది ప్రారంభం కూడా సందడిగా ఉంటుందని ఊహించుకున్నారు. దానికి విరుద్ధంగా జనవరిలో ఓమిక్రాన్ భయాలు మొదలయ్యాయి. దాంతో సంక్రాంతి సినిమా కళ కోల్పోయింది. కేవలం నాగార్జున నాగ చైతన్యల బంగార్రాజు తప్పితే మరే బడా హీరోల చిత్రాలు విడుదలకు ముందుకు రాలేదు. మళ్ళీ ఫిబ్రవరిలో విడుదలైన ‘డి జె టిల్లు’ చిత్రంతో బాక్స్ ఆఫీస్ సందడి నెలకొంది. అదే నెలలో చివరన విడుదలైన పవన్ కల్యాణ్, రానా ల భీమ్లా నాయక్ థియేటర్ల వద్ద సందడి నెలకొంది. టిక్కెట్ల పెంపు సమస్య కారణంగా ఆశించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద నిలపడలేక పోయింది. అయితే థియేటర్లకు ప్రేక్షకులు రావడం ఈ చిత్రంతోనే మొదలైంది.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో స్మాల్ అండ్ బిగ్ మూవీస్ ఏకంగా 100
అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో స్మాల్ అండ్ బిగ్ మూవీస్ ఏకంగా100 సినిమాల వరకు విడుదల అయ్యాయని తెలుస్తోంది. ఒకో వారంలో 16 సినిమాల వరకు విడుదల అయినా సందర్భాలు వున్నాయి. వాటిలో ఎన్ని నిలబడ్డాయో అది వేరే విషయం అనుకోండి. అక్టోబర్ 5న మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ఘోస్ట్, చిత్రాలు విడుదల అయ్యాయి. గాడ్ ఫాదర్ చిత్రం సూపర్ హిట్ కాగా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ఘోస్ట్ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. బెల్లం కొండా గణేష్ హీరోగా పరిచయం అయిన స్వాతి ముత్యం, క్రిటిక్స్ మంచి రేటింగ్ ఇచ్చారు కానీ కలెక్షన్స్ వీక్. ఇక మంచు విష్ణు జిన్నా విడుదలకు ముందు మంచి బజ్ వున్నా బాక్స్ ఆఫీస్ వద్ద నిలపడలేక పోయింది. ఇదే నెలలో విడుదల అయినా ఓరి దేవుడా! ఇదేం ఖర్మరా అంటూ ప్రేక్షకుడు పెదవి విరిచాడు. నవంబర్ నెలలో విడుదలైన సమంత యశోద, మసూద చిత్రాల జోరు కొనసాగింది. గాలోడు, ఉర్వశివో రాక్షసీవో, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, యావరేజ్ కాగా, లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్ ప్లాప్ అయ్యింది. ఇక ఈ నెల డిసెంబర్ 2న విడుదలైన హిట్ 2 తో ఒకే ఏడాది లో రెండు హిట్లు సొంతం చేసుకున్నాడు అడవి శేష్. రవి తేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్, మంచి వసూళ్లను సాధించాయి. ముఖచిత్రం, పంచతంత్రం చిత్రాలు ప్రేక్షకుడి ఆదరణకు నోచుకోలేదు. ఈ వ్యాసం రాసే సమయానికి నెలాఖరు 30న విడుదల అయిన చిత్రాలు అది సాయికుమార్ టాప్ గేర్, బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా పరిచయం అవుతున్నా లక్కీ లక్ష్మణ్ యావరేజ్ టాక్ తో వున్నాయి.
మిలియన్ వ్యూస్ రికార్డు చేసిన తెలుగు గీతాలు
పాటలు లేని మన భారతీయ చిత్రాలు అంటే ఉప్పు లేని కూర లాంటిది. అంతటి ప్రాముఖ్యత మన సినిమాలలో పాటలకుంది. సినిమా విడుదలకు ముందు మనకు మనకు కనిపించేవి, వినిపించేవి పాటలే.. ఈ ఏడాది మొత్తం గరిష్టంగా పదిహేనువందల గీతాలను యు ట్యూబ్ ద్వారా వివిధ ఆడియో కంపెనీలు విడుదల చేసాయి. అయితే వాటిలో మిలియన్ వ్యూస్ సాధించిన పాటలు చెప్పుకుంటే తొలుత ఆర్ ఆర్ ఆర్కి ‘‘నాటు నాటు’’ ఈ పాట ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో వుంది. ఇక చిరంజీవి ఆచార్యలోని లాహే లాహే, సర్కారువారి పాటలో ‘‘కళావతి’’ ‘‘మహేశా’’ డి జె టిల్లులో టైటిల్ సాంగ్ కుర్రాళ్లను కిర్రెక్కిస్తుంది. సీత రామం చిత్రం ముఖ్యంగా సంగీతం ప్లస్ అయ్యింది. భీమ్లా నాయక్‌లో టైటిల్ సాంగ్, కాంతారాలో వరాహ రూపం, విక్రాంత్ రోనాలో రా రా రక్కమ్మ గీతాలు సినీ ప్రేక్షకుడి మెప్పును పొందాయి.
నెల రోజుల పాటు షూటింగ్స్ బంద్
బడ్జెట్ ను అదుపులో పెట్టడానికి చిత్రనిర్మాతలు, ఎంజిబేసిస్ వద్దని పంపిణీదారులు, థియేటర్స్ రన్ చేయలేక పోతున్నామని ప్రదర్శనదారులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను పరిష్కరించడానికి ఆగష్టు 1నుండి సినిమా షూటింగ్స్ బంద్ అని పిలుపునిచ్చింది. తెలుగు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. ఈ బంద్ నిర్ణయంపై సినీ పెద్దలనుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఈ విషయం లో సమర్ధించగా.. మరి కొంత మంది విమర్శించారు. ఈ సందర్భంగా ఓటిటిలో విడుదలకు కాల పరిమితి, కార్మికుల వేతనాలు, వి పి ఎఫ్, అగ్ర హీరో, హీరోయిన్ల పారితోషకాలు మొదలైన అంశాలపై భారీ ఎత్తున సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత అనేక సమస్యలను నియమ నిబంధనలతో పరిష్కరించామని సెప్టెంబర్ 1నుండి తిరిగి షూటింగ్‌లు యదావిధిగా జరుపుకోవచ్చని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రకటించడంతో బంద్ ముగిసింది.
బిగ్ మూవీస్ ఎన్ని హిట్? ఎన్ని ఫట్?
ఏడాది ఆరంభంలో సంక్రాంతికి విడుదల అయిన బంగార్రాజు ఓమిక్రాన్ భయంతో ఎబోవ్ యావరేజ్‌గా ఆడినా… అగ్ర హీరోల సినిమాలను చూడటానికి థియేటర్స్ వద్ద ప్రేక్షకులు రావడం మాత్రం మార్చ్‌లోనే మొదలైంది. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు మార్చ్ నెలలోనే విడుదల అయ్యాయి. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడం, రాధే శ్యామ్ పరాజయం పొందడం తెలిసిందే! అగ్ర హీరోల సినిమాలకు వేసవి సీజన్లో నే మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ వేసవిలో మహేష్ బాబుతో సర్కారు వారి పాట, వెంకటేష్, వరుణ్ తేజ ఎఫ్3 విడుదల అయ్యాయి కానీ అనుకున్న రేంజ్లో వసూళ్లు రాబట్టకాలేకపోయాయి. మార్చ్‌లోనే విడుదల అయిన అశోక వనంలో అర్జునకల్యాణం క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ వచ్చాయి. కల్లెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే! ఏప్రిల్ నెలలో విడుదలైన చిరంజీవి, రామ్ చరణ్ భారీ చిత్రం ఆచార్య మిసరాబుల్ ప్లాప్‌గా కొణిదెల ప్రొడక్షన్స్‌కి అప్పులు మిగిల్చింది. అదే విధంగా గీత ఆర్ట్స్‌లో ఘనీ. మేజర్, అంటే సుందరానికి.. విరాట పర్వామ్ చిత్రాలు జూన్‌లో విడుదల అయ్యాయి. అయితే వీటిలో ఒక్క మేజర్ మాత్రమే నిలబగలిగింది. జులై నెలలో పక్క కమర్షియల్,ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ, చిత్రాలు బాక్స్ ఆఫీస్ లో నిలబడలేకపోయాయి. ఇక ఆగష్టు నెలలో ఒకే రోజున విడుదలైన బింబిసారా, సీతా రామం చిత్రాల టాక్ అండ్ వసూళ్లతో సినీ పరిశ్రమకు మళ్ళీ కళ వచ్చింది. ఇదే నెలలో వచ్చిన మాచర్ల నియోజకవర్గం, లైగర్, చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. సెప్టెంబర్ నెలలో శర్వా నంద్ ఒకే ఒక జీవితం ప్రేక్షకులు, క్రిటిక్స్ మంచి మార్కులు ఇచ్చారు. కృష్ణ వ్రినంద విహారి యావరేజ్ టాక్‌తో నిలబడిరది. ఇక రంగ రంగ వైభవంగా… సుదీర్ బాబు ఆ అమ్మాయిగురించి.. చిత్రాలు బోల్తా పడ్డాయి.
నాటి సినీ దిగ్గజాలను కోల్పోయింది
ఈ ఏడాది 2022 తెలుగు సినీ పరిశ్రమకు విషాద సంవత్సరంగా పేర్కొనవచ్చు. దశాబ్దాలుగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన పలువురు దిగ్గజ నటులను సినిమా రంగం కోల్పోయింది. మహా నటులు ఈ ఏడాదే సినీ అభిమానులకు దూరం అయ్యారు. నటుడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ సోదరుడు రమేష్‌బాబు కాలేయ సంబంధిత వ్యాధితో జనవరి 8న, గుండెపోటుతో సూపర్‌స్టార్ కృష్ణ నవంబర్ 15న, లెజెండరీ ఆర్టిస్ట్ కృషంరాజు సెప్టెంబర్ 11న, డిసెంబర్ 23న నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ, సీనియర్ నటుడు మన్నవ బాలయ్య, డిసెంబర్ 24న నటుడు చలపతి రావు కన్నుమూయడంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక శకం ముగినట్లైంది. ఇంకా జనవరి 2 దర్శకులు పిసి రెడ్డి, శరత్, తాతినేని రామారావు, రచయిత దర్శకుడు మదన్, నిర్మాతలు కె మురారి, నారాయణ్ దాస్ కె నారంగ్, కన్ను మూసారు. భారతరత్న పురస్కార గ్రహీత గాన కోకిల లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న గొంతు మూగబోగా, డిస్కో పాటలతో భారతావనిని ఉర్రుతలూగించిన బప్పి లహరి ఫిబ్రవరి 15న సంగీత దర్శకుడు ఈశ్వర్ రావు, సినీ గేయ రచయిత కందికొండ మొదలైన వారు పరమపదించారు.
సినిమా టికెట్ ధరల వివాదం
సినిమా టికెట్ ధరల విషయం ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసింది. టికెట్ ధరలను అతి దారుణంగా తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను దుమారాన్ని సృష్టించింది. ‘థియేటర్ కలెక్షన్ కంటే ఆ పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్’ అనే మాట నాని నోట రావడం. అనేక మంది సినీ ప్రముఖులు టిక్కెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం మంచిదని, కాదు సినీ పరిశ్రమను అణగదొక్కడానికాని కొందరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ క్రమం లో వారిపై ఏపి ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమాల ద్వారా వేసిన ట్వీట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపి ప్రభుత్వానికి విన్నవించుకోడానికి ఫిబ్రవరి నెలలో చిరంజీవి, నాగార్జున, మహేష్, ప్రభాస్, రాజమౌళి, దిల్ రాజు మరి కొంతమంది సినీ ప్రముఖులు ఒక తాటి పైకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమను ఆదుకోవాలని చేతులు జోడించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని మార్చ్ నెలలో టికెట్ రేట్స్ విషయంలో జి ఓను ప్రవేశపెట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. దీనితో జటిలమైన సమస్యకు పరిస్కారం దొరికింది.
బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన అనువాద చిత్రాలు
గతంలో అనువాదచిత్రాల ఆధిపత్యం కొనసాగేది అది ఈ మధ్య తగ్గింది. అయితే మళ్ళీ 2022లో పరభాషా చిత్రాల హవా కొనసాగింది. కన్నడ భాషలో నిర్మించిన కె జి ఎఫ్ 2, కాంతారా, విక్రాంత్ రోనా, చిత్రాలు బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొట్టాయి. బనారస్, విజయానంద్ చిత్రాలు ప్రేక్షకులు ఆదరించలేదు. తమిళ్లో నిర్మించిన కమల్ హాసన్ విక్రమ్ అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది చాలా కాలం తరువాత కమల్ హాసన్ తన స్టేమినా చూపించారు. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1, కార్తీ సర్ధార్, తెలుగులో పెద్దగా ఆడలేదు. అంచనాలు లేకుండా వచ్చిన దిల్ విడుదల చేసిన లవ్ టుడే ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నుండి వచ్చిన బ్రహ్మాస్త్ర, యావరేజ్ కాగా, కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. ఇక హాలీవుడ్ మూవీ అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రభంజనమ్ సృష్టించి ప్రతి మనిషి ఒక్కసారైనా చూడాలి అనేలా విజయవంతగా ప్రదర్శించబడుతోంది.
2022లో కొత్త దర్శకుల హవా
ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో బాక్సాఫీస్ సినిమాలు ఇండస్ట్రీకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి అని చెప్పాలి. సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడం అనేది చాలా కష్టం అనే మాట వాస్తవం. నటుడు అయినా దర్శకుడు అయినా సరే కష్టపడాల్సిందే. నటుల విషయం ఎలా వున్నా దర్శకుల విషయంలో మాత్రం చాలా కష్టం దర్శకత్వ శాఖలో అనుభవముండాలి. సినిమా ఏ విధంగా తీస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలి, సృజనాత్మకంగా కొత్త కాన్సెప్ట్‌తో కథతో హీరోలను మెప్పించగలగాలి. అన్ని వున్నా సాలిడ్ ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి %ౌౌ% ఇలా ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది.ఒక విధంగా బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ కంటే ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ మరింత ఎక్కువగా పెరిగింది. అయితే 2022లో కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రమే కాకుండా కొత్తగా వచ్చిన టాలెంటెడ్ దర్శకులు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అందించారు. ఇలా ఈ ఏడాది దర్శకులుగా అవకాశాలు కొట్టి సూపర్ హిట్ లు కొట్టారు కొందరు. వాళ్ళు ఎవరు అనేది చూద్దాం.
శ్రీ కార్తిక్
ఒకే ఒక జీవితం సినిమాతో ఏ సందడి లేకుండా సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టేసాడు. ఓ ఫీల్ గుడ్ మూవీగా క్రిటిక్స్ నుండి అభినందనలు అందుకున్నాడు. దర్శకుడు శ్రీ కార్తిక్ టైం ట్రావెల్ నేపథ్యంలో ఒక ఎమోషనల్ డ్రామాను చూపించిన విధానం ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇతనికి నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
విమల్ కృష్ణ
డీజే టిల్లు సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు ఈ యంగ్ డైరెక్టర్ విమల్ కృష్ణ, మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని వారి కెరీర్‌ను సరైన ట్రాక్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటగా డీజే టిల్లు సినిమాతో విమల్ కృష్ణ బాక్స్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాలో హీరో డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన విమల్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
విద్యా సాగర్
అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాను డైరెక్ట్ చేసిన సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ మంచి హిట్ కొట్టారు. ఈ సినిమాకు ఫలక్‌నుమా దాస్ సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. అతని మేకింగ్ విధానం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా టేకింగ్ చాలా బాగుందని విమర్శకులు ప్రశంసించారు.
సాయికిరణ్
ఈ ఏడాది చివర్లో బెస్ట్ హారర్ మూవీగా మసూద నిలిచింది. ఇంతకుముందు వచ్చిన హారర్ మూవీస్ కంటే విభిన్నంగా వచ్చిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా పెట్టిన పెట్టుబడికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించింది.
వశిష్ఠ
వశిష్ఠ అల్లు అర్జున్ ‘బన్నీ’ సినిమా నిర్మాత తనయుడు. ఎన్టీర్ ఆర్ట్స్‌లో అతనొక్కడు తో సురేందర్ రెడ్డిని, పటాస్ చిత్రంతో అనిల్ రావిపూడిని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కు చెందుతుంది. ఈ ఏడాది ‘బింబిసార’ సినిమా కు వశిష్టను పరిచయం చేసారు. కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో క్రియేట్ చేసిన డ్రామా అన్ని వర్గాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రం చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో మరో హిట్ డైరెక్టర్ ని పరిశ్రమకు అందించారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం అగ్రహీరోలకు కథలు రెడీ చేసేపనిలో వున్నాడు వశిష్ఠ.













