Allu Arjun: అల్లు అర్జున్ ఎపిసోడ్కు ముగింపు పలికినట్లేనా..?
దాదాపు పది రోజులుగా అల్లు అర్జున్ (Allu Arjun) ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ (Sandhya Theatre) లో బెనిఫిట్ షోకు వెళ్లాడు అల్లు అర్జున్. ఆ సందర్భంగా తొక్కిసలాట (stampede) జరిగి ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు డిసెంబర్ 11న అల్లు అర్జున్ ను అరెస్టు (Allu Arjun Arrest) చేశారు. ఒక రాత్రి ఆయన జైల్లో ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్టును పలువురు సినీ, రాజకీయ నేతలు ఖండించారు. రేవంత్ ప్రభుత్వం తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు. ఇది చినికి చినికి గాలివానగా మారింది.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అల్లు అర్జున్ ను కావాలనే అరెస్టు చేసిందని ఇంటాబయటా బాగా ప్రచారం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (MIM MLA Akbaruddin) ఈ అంశాన్ని లేవనెత్తడంతో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆరోజు సంధ్య థియేటర్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించారు. ఆ వివరణ విన్న తర్వాత అల్లు అర్జున్ దే తప్పు అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో అల్లు అర్జున్ అదే రోజు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. తనకేమీ తెలీదన్నారు. తనపై వస్తున్నఆరోపణలన్నీ అసత్యాలేనని.. కావాలనే కొందరు అలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ క్లారిటీని అల్లు అర్జున్ ఖండించడంతో ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకుంది. ఆరోజు థియేటర్లో ఏం జరిగిందో 9 నిమిషాల వీడియోను సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) బయటపెట్టారు. దీంతో అల్లు అర్జున్ తప్పును మరింత సూటిగా రుజువు చేసినట్లయింది. అంతేకాక అల్లు అర్జున్ ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారు. అంతకుముందు ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ కు వెళ్లి సానుభూతి తెలపడంపైన కూడా సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలకు కూడా అనుమతించబోమని స్పష్టం చేసేశారు. దీంతో ఇది ఎక్కడికో వెళ్లేలా ఉందని అందరూ అనుకున్నారు.
ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావించిన కొంతమంది పెద్దలు ఇటీవలే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (FDC Chairman) గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజును (Dil Raju) కలిశారు. దీంతో దిల్ రాజు జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇంతలో పుష్ప 2 యూనిట్ బాధిత రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆసుపత్రిలో అందజేసింది. అంతేకాక.. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అపాయిట్మెంట్ కూడా ఖరారు చేశారు దిల్ రాజు. పలువురు సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డిని కలిసి తాజా పరిణామాలపై చర్చించనున్నారు. దీంతో ఈ వ్యవహారానికి ఇంతటితో ముగింపు లభిస్తుందని ఆశిస్తున్నారు.













