దర్శకురాలు బి.జయ కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. దర్శకురాలు బి.జయ(54) గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. పాత్రికేయురాలిగా ప్రస్థానాన్ని ఆరంభించిన జయ..తర్వాత ప్రముఖ సినీ వార పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు. దర్శకత్వం పట్ల ఆసక్తితో ఆ రంగంవైపు అడుగేశారు. 2003 లో చంటిగాడు అనే సినిమాకు జయ దర్శకత్వం వహించారు. దాని తర్వాత ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం లాంటి చిత్రాలకు జయ దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన వైశాఖం ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం. ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. దర్శకురాలు, జర్నలిస్ట్‌గానే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాలకు తానే ఎడిటింగ్ చేసుకునేవారు జయ. పంజాగుట్ట శ్మశాన వాటికలో జయ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.













