వైఎస్ జగన్ మీద చిరు, మహేష్, రాజమౌళి వరుస ట్వీట్లు, ప్రశంశల జల్లు
టాలీవుడ్ పెద్దలు ఈ రోజు సీఎం వైఎస్ జగన్ను కలిసిన సంగతి తె లిసిందే. ఈ సందర్భంగా సాగిన చర్చల మీద చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి ట్వీట్స్ ద్వారా స్పందించారు. టాలీవుడ్ టికెట్ రేట్ల అంశం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. నేడు టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి వంటి వారంతా కూడా సీఎం జగన్ను కలిశారు. చర్చలు సఫలం అవ్వడం, అనుకూలంగా జీవోను విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో సీఎం జగన్కు, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోద యోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ, పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంతి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమలోని ప్రతీ ఒక్కరి తరుపున మరో మారు కృతజ్ఞతలు. త్వరలోనే అధికారికంగా పరిశ్రమకు శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాం.
తెలుగు సినిమా పరిశ్రమ తరుపున మా బాధలను విని, తెలుగు సినిమా మళ్లీ ప్రకాశించేందుకు అనుగుణంగా జీవోను సిద్దం చేస్తానని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి థ్యాంక్స్. మా పరిశ్రమ ఎదుర్కొంటున్న సాధక బాధల గురించి మీరు తెలుసుకున్న విషయాలు, పట్టించుకున్న తీరు ఎంతో సంతోషాన్ని కలిగించింది. పరిశ్రమకు మేలు కోసం త్వరలోనే ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని ముందుండి నడిపించిన చిరంజీవి గారికి, ఇదంతా సాధ్యమయ్యేలా చేసిన పేర్ని నాని గారికి థ్యాంక్స్’ అని మహేష్ బాబు ట్వీట్ వేశాడు.













