లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీ

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్ ప్రేమజంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు. దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్ తల్లి ఆయేషా. “మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి” అని మండిపడింది. ‘టైగర్ ష్రాఫ్.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి’ అని ఆయేషా చెప్పుకొచ్చింది.