టాలీవుడ్లో పెద్ద హిట్ అయిన సినిమాకు బాలీవుడ్లో సీక్వెల్‌కు సన్నాహాలు
ఒక సినిమా సూపర్‌హిట్ అయితే దానికి సీక్వెల్ చేసి ఎంతో కొంత క్యాష్ చేసుకోవాలని దర్శకనిర్మాతలు ఆలోచించడంలో తప్పులేదు. అయితే తెలుగులో సూపర్‌హిట్ అయిన సినిమాకి బాలీవుడ్లో సీక్వెల్ చెయ్యాలన్న ఆలోచన రావడం మాత్రం విచిత్రంగానే అనిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన పరుగు చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను టైగర్ ష్రాఫ్ హీరోగా `హీరో పంతి` పేరుతో రీమేక్ చేశాడు షబ్బీర్‌ఖాన్. ఈ సినిమా ద్వారానే టైగర్ ష్రాఫ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమా తర్వాత వర్షం, క్షణం, తడాఖా హిందీ రీమేక్‌లలో కూడా టైగర్ ష్రాఫ్ నటించాడు. అతని మొదటి సినిమా `హీరో పంతి` పెద్ద హిట్ అవ్వడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ షబ్బీర్. అతను ప్రస్తుతం ఈ సీక్వెల్ కథ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ గెస్ట్‌గా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి దర్శకనిర్మాతలు షబ్బీర్‌ఖాన్, సాజిద్ నాడియాడ్వాలా.. బన్నీని సంప్రదించినట్టు సమాచారం. మరోపక్క పరుగు చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని దిల్‌రాజుకు ఎప్పటి నుంచో ఉంది. ఇంతకుముందే దీని గురించి ఓసారి ప్రస్తావించాడు దిల్‌రాజు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. కానీ, బాలీవుడ్లో మాత్రం ఈ సినిమా సీక్వెల్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.













