ఎప్పటికీ పెళ్లి చేసుకోనంటున్న సాయిపల్లవి!
`ఫిదా` చిత్రంలోని తన నటనతో, తన అల్లరితో అందరి చేత శభాష్ అనిపించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఒక విభిన్నమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఇప్పటి హీరోయిన్‌కి ఉండాల్సిన లక్షణాలు అస్సలు లేని అమ్మాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఆమె తన అంగాంగాలు ప్రదర్శించడానికి ఒప్పుకోదు. హద్దులు మీరే శృంగార సన్నివేశాల్లో నటించనని ఖరాఖండీగా చెబుతుంది. మరి ఈ తరం హీరోయిన్లు, బాలీవుడ్ నుండి దిగుమతి అయిన హీరోయిన్లు వీటిల్లో ఏ ఒక్కదానికీ నో చెప్పరు. అలాంటప్పుడు సాయిపల్లవిని డిఫరెంట్ హీరోయిన్ అని చెప్పాలి కదా. అలాంటి సీన్స్ చెయ్యడానికి ఇష్టపడక చాలా సినిమాలు వదులుకుంది సాయిపల్లవి. అంతెందుకు కొన్ని సూపర్‌హిట్ సినిమాలు చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఒక ఇమేజ్ అంటూ ఏర్పడుతుంది. దాంతో కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తే మంచి ఆఫర్ ఇస్తామని చెప్పే వాళ్లు కూడా ఉంటారు.
సాయిపల్లవికి ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీవారు కోటి రూపాయలు ఆఫర్ చేశారు. తమ కంపెనీ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చెయ్యమని అడిగారు. కానీ, దానికి కూడా పల్లవి ఒప్పుకోలేదు. ఎందుకంటే మొటిమలతో ఉన్న తాను ఒక ఫెయిర్ క్రీమ్ యాడ్‌లో ఎలా నటించగలను? అభం శుభం తెలియని అమ్మాయిల్లో అపోహలు ఎలా సృష్టించగలను? అంటూ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది.
ఒకరు పైకి ఎదుగుతున్నారంటే వారిని కిందకు లాగేందుకు ఎవరో ఒకరు సిద్ధంగానే ఉంటారు. సాయి పల్లవి విషయంలో కూడా అదే జరుగుతోంది. అందమైన హీరోయిన్లు ఎవరైనా సరే రూమర్స్‌ని ఎదుర్కోవాల్సిందే. వాటికి సరైన రీతిలో స్పందించాల్సిందే. ఆమె హీరోయిన్గా నటించిన ప్రతి సినిమా హీరోతోనూ ఏదో ఒక విషయంలో ఆమెకు విభేదాలు వస్తాయి. ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆయా హీరోలు పొగరుగా భావిస్తారని, అందుకే ఆమెపై రకరకాల వ్యాఖ్యలు చేస్తారని ఆమె సన్నిహితులు చెబుతారు. ఇవిగాక ఆమెపై మరో రూమర్ వచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజను వివాహం చేసుకోబోతోందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసింది. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. మరో రెండేళ్లలో తాను ఇష్టపడే ఓ వ్యక్తిని సాయి పల్లవి వివాహం చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెబుతుందనేది ఆ వార్త. తాజాగా ఈ వార్తలపై సాయిపల్లవి స్పందించింది. “నాకు ఇప్పుడే వివాహం చేసుకునే ఉద్దేశం లేదు. నా కెరీర్‌పైనే నా దృష్టంతా. పెళ్లి విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. నాకు నా తల్లిదండ్రులంటే ప్రాణం. వారి కోసం నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని అనుకుంటున్నాను. అందుకే వారు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను“ అని చెప్పింది.













