అసలైన సినిమా పండగంతా ఏప్రిల్ లోనే..
కరోనా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు ఊపందుకున్నాయి. జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టడంతో నిర్మాతలు సినిమాలను రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. జనవరి నుంచి వారానికి నాలుగైదు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ముందు మూడు నెలల్లో వచ్చిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ గా నిలిస్తే, మరికొన్ని యావరేజ్ గా, ఇంకొన్ని ఫ్లాపులుగా మిగిలాయి. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఓ మాత్రం సినిమాలే కానీ భారీ సినిమాలేవీ లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో వచ్చే సినిమాలతో అసలు వేడి మొదలు కానుంది.
ఏప్రిల్ 2 (ఇవాళ)న నాగార్జున నటించిన వైల్డ్ యాగ్, కార్తి నటించిన సుల్తాన్ లు ప్రేక్షకుల ముందుకు వస్తే, వచ్చే వారం ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రెడీగా ఉంది. వేణు శ్రీ రామ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సాంగ్స్ , ట్రైలర్లు కూడా ఆకట్టుకునే ఉన్నాయి. పవన్ సినిమా కాబట్టి, టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయి.
ఇక ఆ తర్వాత వారానికి నాగచైతన్య, సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా టీజర్, పాటలకు అమితమైన రెస్నాన్స్ రావడంతో దీని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తన్నాయి. ఫిదా తర్వాత శేఖర కమ్ముల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ఏప్రిల్ 23న నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన టక్ జగదీష్ రిలీజ్ కానుంది. షైన్ స్ర్కీన్ బ్యాన్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రమోషనల్ కార్యక్రమాలతో టక్ జగదీష్ మంత్ గా మార్చేసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయేలా చేస్తున్నారు. అదే రోజు టక్ జగదీష్ కు పోటీగా తలైవి సినిమా రానుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కూడా అందరి ప్రశంసలు పొందింది.
ఇక రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న విరాఠపర్వం ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేను ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇవే కాకుండా మొత్తం ఏప్రిల్ లో మరో 20 చిన్న సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ నెల టాలీవుడ్ కు చాలా కీలకం కానుంది.













