Kota Srinivasa Rao: కోటాకు తీరని కోరిక అదే

700కి పైగా సినిమాల్లో నటించి ప్రతీ క్యారెక్టర్ లోనూ ప్రేక్షకుల్ని మెప్పించి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న కోటా శ్రీనివాసరావు(kota srinivasarao) ఆదివారం కన్ను మూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. నటుడిగా ఎన్నో పాత్రల్లో మెప్పించిన ఆయనకు ఓ కోరిక మాత్రం తీరని కలలానే మిగిలిపోయింది. అదే స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్(Sr. NTR) తో కలిసి నటించడం.
దానికి కారణం కోటా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి సీఎంగా బిజీ అయ్యారు. ఆ తర్వాత కోటా టైటిల్ రోల్ సి. ప్రభాకర్ రెడ్డి(C. Prabhakar Reddy) దర్శకత్వంలో ఎన్టీఆర్ పాలనను, వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మండలాధీశుడు(Mandaladheesudu) అనే సినిమా వచ్చింది. ఎన్టీఆర్ ను విమర్శిస్తూ తీసిన సినిమా కావడంతో అందరూ కోటాపై చాలా కోప్పడ్డారు. ఓ సారి రైల్వే స్టేషన్ లో ఆయనపై దాడి కూడా చేయబోయారు. వాటన్నింటినీ ఎన్టీఆర్ మనసులో పెట్టుకోకుండా కోటాను క్షమించారు.
తర్వాత మళ్లీ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేశారు కానీ అందులో కూడా కోటాకు అవకాశం మాత్రం రాలేదు. ఆఖరికి మేజర్ చంద్రకాంత్(Major Chandrakanth) కోసం రాఘవేంద్రరావు కోటాను పిలవగా, డేట్స్ సమస్య వల్ల ఆ ఛాన్సు ను కూడా వదులుకున్నారు కోటా. దీంతో ఎన్టీఆర్ తో సినిమా చేయాలే కోరిక కోటాకు కలలానే మిగిలింది. కానీ ఆ కోరికను అతని మనవడు జూ.ఎన్టీఆర్(Jr.NTR) తో నటించి కొంతమేర తీర్చుకున్నారు కోటా.