ఆగస్ట్ 15 పోటీకి మరో సినిమా
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రిలీజ్ కానున్న పుష్ప2 ఆగస్ట్ 15 నుంచి వాయిదా పడగానే వివిధ భాషల నుంచి సినిమాలు ఆ డేట్ కు క్యూ కడుతున్నాయి. పుష్ప2 చెప్పిన డేట్ కు రిలీజ్ అయితే తెలుగు, ఇతర ప్రధాన భాషల్లో చెప్పుకోదగ్గ వేరే రిలీజ్ ఉండేవి కావు. కానీ పుష్ప2 పోస్ట్‌పోన్ వార్త లీకవగానే వెంటనే ఆ డేట్ లో డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయనున్నట్లు రామ్- పూరీ కర్ఛీఫ్ వేసేసుకున్నారు.
ఆ తర్వాత 35, ఆయ్ విశ్వం మరో రెండు సినిమాలు ఆ డేట్ పై కన్నేశాయి. హిందీ, తమిళ భాషల నుంచి కూడా ఆ వీకెండ్ కు సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేదా కూడా ఆ వీకెండ్‌కే షెడ్యూల్ అయ్యాయంటున్నారు. ఇవి కాకుండా తాజాగా కోలీవుడ్ నుంచి విక్రమ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా తంగలాన్ కూడా ఇప్పుడదే రోజున రిలీజ్ కానుంది.
చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తంగలాన్ గతేడాదే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేటవడం వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పుడు ఆగస్ట్ 15ని ఎంచుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తంగలాన్ అంచనాలకు తగినట్లు ఉంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే ఛాన్స్ పుష్కలంగా ఉంది.













