థియేటర్ ను ధ్వంసం చేసిన విజయ్ ఫ్యాన్స్
ఏదైనా సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు అనుకోకుండా వచ్చే అంతరాయాల వల్ల సినిమా రన్ టైమ్ , లేకపోతే మళ్ళీ తిరిగి ప్రారంభించడం ఇలాంటివి ఏవైనా జరిగితే ఫ్యాన్స్ కోపానికి థియేటర్ల పని అయిపోయినట్లే. ఇలా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయనే చెప్పాలి. ఫ్యాన్స్ కి ఒక్క కోపమే కాదు , ఆనందం వచ్చినా కూడా అంతే సంగతులు. అయితే అసలు విజయ్ ఫ్యాన్స్ కి థియేటర్ ధ్వంసం చేసే అవసరం ఏముంది అని అనుకొంటున్నారా??
ఈ ఘటన ఎక్కడో కాదు చెన్నైలో బాగా పాపులర్ అయిన రోహిణి థియేటర్ లో జరిగింది. విజయ్ ఫ్యాన్స్ ఈ థియేటర్ను ధ్వంసం చేసారు. దీనికి థియేటర్ యాజమాన్యం లోపమేమి కారణం కాదు. తమిళ్ స్టార్ విజయ్ నటించిన ‘లియో’ ట్రైలర్ బాగా లేకపోవడమే దీనికి కారణం. ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శనలో భాగంగా థియేటర్ కి భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.
అంతా బాగానే ఉంది సినిమా ట్రైలర్ కూడా ఒకటికి రెండుసార్లు ప్రదర్శించారు. అయితే ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేదు. అంతే ఇంక ఆ అసంతృప్తి మొత్తం ఏ సంబంధం లేని థియేటర్ పైన చూపించారు. అన్ని సీట్లను ధ్వంసం చేసారు. అసలు ట్రైలర్ బాగాలేకపోతే థియేటర్ మీద కోపం చూపిస్తే ఎలా ? ఆ సినిమాకు సంబంధించిన టీమ్ ని తిట్టాలి కానీ , ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ని ప్రదర్శించిన పాపానికి థియేటర్ యాజమాన్యానికి సరిగానే బుద్ధి చెప్పారు విజయ్ ఫ్యాన్స్. ఇకపై వేరే ఏ సినిమా ట్రైలర్ ని ప్రదర్శించాలన్న థియేటర్ యాజమాన్యం కొంచెం ఆలోచించాల్సిందే .













