తనతో మరో సినిమా చేస్తా- టిజి విశ్వప్రసాద్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. రీసెంట్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవడంతో నిర్మాత టిజి విశ్వప్రసాద్ హరీష్ శంకర్ పై సీరియస్ గా ఉన్నాడని కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తాను హరీష్ పై ఎలాంటి విమర్శలు చేయలేదని, హరీష్ తనకు ముందుగా మంచి ఫ్రెండ్ అని, ఈ సినిమా సక్సెస్ అవకపోయినా ఈ జర్నీలో చాలా నేర్చుకున్నానని మాత్రమే తాను అన్నానని, దాన్ని మీడియా వేరేలా ప్రొజెక్ట్ చేసిందని, హరీష్ తో వర్క్ చేయడం తనకు ఎంతో హ్యాపీగా ఉందని, మరోసారి కూడా ఆయనతో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్లు విశ్వప్రసాద్ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు హరీష్ శంకర్ కు మేకర్ గా గొప్ప టాలెంట్ ఉందని, సినిమా ఫ్లాపైందని తెలిసి తన రెమ్యూనరేషన్ కూడా వదులుకోవడానికి రెడీ అయ్యాడంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని విశ్వప్రసాద్ సోషల్ మీడియా సాక్షిగా తెలిపాడు. ఈ పోస్ట్ కు హరీష్ రిప్లై ఇస్తూ, ఆ మాటలు మీరు మాట్లాడి ఉండరని నేను బలంగా నమ్మానని, షూటింగ్ టైమ్ లో మీరిచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని, ఫ్యూచర్ లో మీతో కలిసి పని చేయడమే కాకుండా మీకు మంచి హిట్ అవ్వడానికి ట్రై చేస్తానని హరీష్ పోస్ట్ చేశాడు.













