తెలంగాణలో సోనూ సూద్ కు గుడి
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కోరనా సమయం నుండి ఇప్పటి వరకు అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. వలస కార్మికులని సొంతిళ్ళకు పంపి వారి కళ్ళల్లో ఆనందం చూశాడు. ఉద్యోగాలు పోయిన వారికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చేశాడు. విదేశాలలో ఉన్న వారిని కూడా వారి ఇళ్ళకు చేర్చడం కోసం అనేక ఏర్పాట్లు చేశారు. ఆయన సేవలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు.
చేతికి ఎముక లేదన్నట్టు సాయం చేసి రియల్ హీరోగా మారిన సోనూసూద్‌పై అన్ని రాష్ట్రాల ప్రజలు ప్రేమ చాటుకుంటున్నారు. ఆ మధ్య బెంగాల్‌లోని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన దుర్గా మండపాల వద్ద నిర్వాహకులు సోనూసూద్ ప్రతిమను ఉంచి ఆయనపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాకు చెందిన రాజేష్ రాథోడ్‌కు సోనూసూద్ అంటే అభిమానం. కరోనా సమయంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు ముగ్ధుడైన రాజేష్ తమ తండాలో సోనూ సూద్ కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేష్ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు. స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఎంతో మందికి ఆపననహస్తంగా నిలిచిన సోనూసూద్‌కి గుడి కట్టడం సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు.













