చిన్నితెర స్టార్లకూ తప్పని ‘కోత’లు…
కరోనా దెబ్బకు తారలు దిగివస్తున్నారు. ఇప్పటికే పెద్ద తెరపై స్టార్ల రెమ్యునరేషన్స్కు భారీగానే కోత పడుతోంది. భారీ నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలను ఆదుకోవడానికి కొందరు స్టార్స్ స్వఛ్చందంగానే ముందుకు వస్తుంటే మరికొందరు మాత్రం నిర్మాతల ఒత్తిడికి తలొగ్గుతున్నారు. సినీనటి కీర్తి సురేష్ వంటి వారు తమ రెమ్యునరేషన్‌ని స్వఛ్చందంగా తగ్గించుకుని మరికొందరికి స్పూర్తి ఇస్తున్నారు.
ఇదలా ఉంచితే.. ఈ పరిస్థితి చిన్నితెరను కూడా చుట్టుముట్టినట్టు సమాచారం. దాదాపుగా మూడు నెల పాటు షూటింగ్స్ లేకపోవడంతో భారీ నష్టాలు చవి చూసింది తెలుగు టీవీ రంగం. ఇప్పుడిప్పుడే చిన్నితెర షూటింగ్స్ సందడి మళ్లీ మొదలైంది. అయితే అడపాదడపా కరోనా పాజిటివ్‌ల ధాటికి పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాయి షూటింగ్స్. ఈ నేపధ్యంలో మరోవైపు తెలుగు చిన్ని తెరపై స్టార్ యాంకర్స్ పారితోషికాలు తగ్గించినట్లుగా తెలుస్తోంది.
ఈటీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలకు హోస్ట్‌లుగా వ్యవహరించే సుమ, ప్రదీప్‌లతో పాటు పలువురికి పారితోషికాలు భారీగా తగ్గించారట. ఒక్క ఎపిసోడ్‌కు దాదాపు లక్షన్నర పారితోషికం సుమ తీసుకుంటుందని, అయితే క్యాష్ కార్యక్రమం కోసం సుమ తీసుకునే ఈ పారితోషికంను భారీగా తగ్గించారని వినికిడి. లక్షన్నర నుండి లక్ష రూపాయలకు పారితోషికంను తగ్గించారనేది టాక్.ఇక ప్రదీప్ పారితోషికంలో కూడా దాదాపుగా 35 శాతం కోత విధించారట.దాంతో ఆయన కూడా తక్కువ పారితోషికంను అందుకుంటున్నాడు.జబర్దస్త్ కామెడియన్స్కు కూడా గతంలో మాదిరిగా భారీగా పారితోషికాలు ఇవ్వడం లేదు. అంత పెద్ద గ్రూప్ టీవీ స్టార్స్‌కి కోతలు మొదలుపెట్టడాన్ని చూసి దీనిని మరికొన్ని చానెళ్లు కూడా అనుసరించనున్నాయట.













