పెద్ద…చిన్న సినిమాలకు బతుకునిచ్చిన 2018
తెలుగు సినిమారంగానికి 2018 సంవత్సరం బాగానే కలిసి వచ్చినట్లు ఉంది. దానికితోడు ఇతర పరిశ్రమలతో పోల్చుకుంటే తెలుగు సినిమా రంగం వరుస విజయాలతో, కొన్ని సార్లు ఫ్లాప్‌లతో దూసుకుపోతోంది. ఈ ఏడాది భారీ చిత్రాలతో పాటుగా అనేక లో బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఒకవైపు స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ విజయాన్ని చేజిక్కించుకున్నట్టుగానే చిన్న సినిమాలు సైతం ప్రేక్షకాదరణ పొందాయి. టాలీవుడ్ నుంచి ఈ సారి కూడా పెద్ద సంఖ్యలోనే సినిమాలు వచ్చాయి. విజయాలు మాత్రం చెప్పకోదగ్గవిగా కనిపించలేదు. వచ్చిన సినిమాల్లో 10 శాతం సినిమాలు కలెక్షన్స్ బాట పడి లాభాలను తెచ్చిపెట్టాయి. పెద్ద స్టార్స్ నటించే చిత్రాలకు ఉన్న మినిమం గ్యారెంటీ చిన్న సినిమాలకు ఉండదు. అయినప్పటికీ ఈ ఏడాది అనేక చిన్న సినిమాలు విడుదలయ్యాయి.
భారీ బడ్జెట్‌తో వచ్చిన చిత్రాల్లో 2018లో సంచలన విజయం సాధించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది., తక్కువ వ్యయంతో నిర్మించి, ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా గీత గోవిందం లిస్ట్‌లో చేరింది. అంతేకాదు ఎక్కువ మంది వీక్షించిన చిత్రంగా చరిత్రకెక్కింది. భారీ బడ్జెట్ చిత్రాలకు రంగస్థలం, చిన్న బడ్జెట్ చిత్రాలకు గీతగోవిందం విజయాలు స్ఫూర్తిని కలిగించాయని చెప్పవచ్చు. అగ్రహీరోలు సైతం ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ముందుకురావడం అభినందనీయం. రెగ్యులర్ మాస్ పాత్రలకంటే ఆర్టిస్టుగా పేరు తెచ్చుకునే కథలవైపు వాళ్ళు మొగ్గుచూపుతున్నారని పలువురు దర్శకులు అంటున్నారు. మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను సినిమా కూడా ఇలాంటి ప్రయోగ చిత్రాల కోవలోకి వస్తుంది. హీరోయిజం అనే గీత దాటకుండా చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు.
దివంగత నటి సావిత్రి బయోపిక్ మహానటి ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. తెలుగులో వచ్చిన విజయవంతమైన బయోపిక్ ఇది. పైగా చాలామందికి తెలిసిన సావిత్రి కథని చక్కగా తెరకెక్కించారు. ఒక బయోపిక్ తీయడానికి అవలంభించాల్సిన పద్దతిని ఈ సినిమా తెలియజేసింది. ప్రధాన కథని పక్కదారి పట్టించకుండా, వివాదాలకు తావు ఇవ్వకుండా తీశారు. కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండతో పాటుగా అనేక మంది సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటించారు. మహానటి బాక్సాఫీస్ విజయాన్ని పొందింది. సినిమాలు చూడ్డం మానేసిన పాతతరం ప్రేక్షకులను మళ్లి థియేటర్లకు రప్పించింది.
ఈ ఏడాది నూతన దర్శకులు తీసిన పలు సినిమాలు ప్రేక్షకాదరణ చూరగొన్నాయి. వాటిలో తొలిప్రేమ ఒకటి. వరుణ్‌తేజ్, రాశీఖన్న నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ విజయం పొందింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ అందుకున్న మరో విజయం. చిన్న సినిమాల్లో మరొక సినిమా నీదీ నాదీ ఒకే కథ. శ్రీవిష్ణు, సత్న టీటూస్, పోసాని కష్ణమురళి నటించిన చిత్రమిది. వినోదం కంటే సందేశానికి ఈ చిత్రంలో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే యువ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. కమర్షియల్‌గా సైతం వర్కవుట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. పరిమిత వ్యయంతో తీసిన గూడఛారి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ విజయాన్ని పొందింది. ఆది శేష్, శోభిత దూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్ ఇందులో నటించారు. హీరో విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలకు పైరసీ ఇబ్బంది ఎదురైనప్పటికీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని పొందడం విశేషం. టాక్సీవాలా సినిమా మొత్తం పైరసీ అయింది. రిలీజ్‌కు ముందే ఈ పరిస్థితి ఎదురవడంతో నిర్మాతలు ఖంగుతిన్నారు. అయినప్పటికీ ధైర్యంగా రిలీజ్ చేశారు. ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమాను చూశారు. విజయాన్ని అందించారు. దీనికి కారణం సినిమా కథనం వైవిథ్యంగా ఉండడమే. ఇక సినిమా బావుంది అని భావిస్తే పైరసీ సైతం ఏం చేయలేదని టాక్సీవాలా విజయం నిరూపించింది.
కేరాఫ్ కంచరపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కంచరపాలెం గ్రామం నేపథ్యంలో తీశారు. గ్రామస్తులే పాత్రధారులు. ఈ సినిమా నిర్మాణంలో చాలా మంది భాగస్వాములయ్యారు. నటుడు నాని నిర్మాతగా తీసిన చిత్రం ఆ!. రెజీనా, కాజల్, నిత్యామీనన్ వంటి అగ్రనాయికలు నటించారు. ఇదొక ప్రయోగాత్మక ప్రయత్నంగా నిలిచింది. రాయలసీమ జీవన చిత్రాన్ని మరోకోణంలో చూపించిన సినిమా అరవింద సమేత. ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. అయితే కాంబినేషన్ క్రేజ్ కారణంగా అధిక ధరలకు అమ్మడంతో కొంత తేడా వచ్చిందని సీనీవర్గాలు అంటున్నాయి. తన రెగ్యులర్ పాత్రకు భిన్నమైన క్యారెక్టర్‌ను ఎన్టీఆర్ చూపించాడు.
భరత్ అనే నేను సినిమా కూడా మంచి కలెక్షన్లను సాధించింది. మహేష్‌బాబును ముఖ్యమంత్రి పాత్రలో చూపించిన ఈ చిత్రం యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. రాజకీయాల్లో యువత వస్తే ఎలాంటి మార్పులు వస్తాయో అన్న విషయాన్ని ఈ చిత్రం బాగా చూపించింది. ఈ సంవత్సరం హిట్టయిన చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి.
ఈ సంవత్సరం వచ్చిన మల్టీస్టారర్ సినిమాల్లో దేవదాస్ ఒకటి. నాగార్జున, నాని కలిసి నటించారు. పక్కా కమర్షియల్ ఫార్మెట్లో తీసిన సినిమా. ప్రేక్షకుల ఆదరణ లభించింది. కమర్షియల్ విజయం పొందింది. సీనియర్ హీరోతో వర్థమాన హీరో నటించడంతో కాంబినేషన్ సినిమాగా ప్రచారం జరిగింది. ఏదీ ఏమైనా ఈ?సంవత్సరం టాలీవుడ్‌కు బాగా అచ్చి వచ్చిన సంవత్సరంగా చెప్పవచ్చు. సినిమాల సంఖ్య పెరిగినప్పటికీ విజయాల సంఖ్య పెరగడం టాలీవుడ్లో పెరిగిన రాశిని తెలియజేస్తోంది.













