జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు క్రేజ్.. లెక్కకు మించి బాలీవుడ్లో రీమేక్‌లు!
ఒకప్పుడు హిందీతోపాటు ఇతర భాషల్లో సూపర్‌హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగులో సూపర్‌హిట్ అయి కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ సాధించిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆ వరసలో చాలా తెలుగు సినిమాలు ఉన్నాయి.
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ దక్కించుకుంది. రణవీర్ సింగ్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. హిందీలో కూడా పూరి జగన్నాథే దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ హీరోగా అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్నాడు. గత సంవత్సరం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన జెర్సీ తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో మంచి హిట్ అందుకున్న షాహిద్ కపూర్ ఇపుడు ‘జెర్సీ’ తో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది.
11 సంవత్సరాల క్రితం అనుష్క ఇమేజ్‌నే మార్చేసిన అరుంధతి చిత్రాన్ని అల్లు అరవింద్ హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అనుష్క పాత్రలో దీపికా పదుకునే నటించనుందని సమాచారం. ఈ చిత్రానికి మధు మంతెన మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ ఏ భాషలో అయినా సక్సెస్ అవుతుంది. అందుకే హిందీతోపాటు పలు భాషల్లో ఈ సినిమా రీమేక్ అవుతోంది. హిందీ రీమేక్‌లో కూడా నవీన్ పొోలీశెట్టి నటించే అవకాశం ఉంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన దువ్వాడ జగన్నాథమ్ చిత్రాన్ని హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కూడా హరీష్ శంకరే దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన భాగమతి చిత్రాన్ని దుర్గావతి పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన అశోక్ హిందీ రీమేక్‌ను కూడా చేస్తున్నాడు. విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను హిందీలో రాజ్‌కుమార్ రావు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలోనే రూపొందనుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘టాక్సీవాలా’ చిత్రాన్ని హిందీలో ‘ఖాళీ పీలి’ బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అలీ అబ్బాస్ జఫర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రితేష్ రాణా దర్శకత్వంలో జై సింహా, నరేష్ అగస్త్య, సత్య ప్రధాన పాత్రలో నటించిన ‘మత్తు వదలరా’ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి రంగం సిద్దం అయింది. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన రితేష్ రాణా ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.
గత ఏడాది వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన ఎఫ్2 తెలుగులో సంచలన విజయం సాధించింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు, బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో హిందీలో రీమేక్ కాబోతోంది. అలాగే శ్రీ విష్ణు, సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘బ్రోచేవారెవరురా’ తెలుగులో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇలా లెక్కకు మించిన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. రీమేక్ అవుతున్న సినిమాల లిస్ట్‌ను చూస్తుంటే రాబోయే రోజుల్లో బాలీవుడ్లో నిర్మాణం జరుపుకునే సినిమాలన్నీ తెలుగు రీమేక్లుగానే కనిపిస్తున్నాయి. అదీగాక ఈ సినిమాల ద్వారా తెలుగు దర్శకులు బాలీవుడ్లో దర్శకులుగా పరిచయం కావడం మరో విశేషం. మున్ముందు బాలీవుడ్లో ఇంకా ఎన్ని తెలుగు సినిమాలు రీమేక్ అవుతాయో చూడాలి.













