తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోండి
కేరళ, కర్ణాటక తరహాలో తెలుగు సినిమా రంగాన్ని ఆదుకోవాలని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. జీఎస్టీ 28శాతాన్ని నిరసిస్తూ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు పతాని రామకృష్ణగౌడ్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నారాయణమూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా కొంతమంది అగ్ర నిర్మాతల గుత్తాధిపత్యం కారణంగా పరిశ్రమలో చిన్న నిర్మాతల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల లీజు విధానాన్ని తొలగించాలని, డిజిటల్ ధరలను తగ్గించాలని కోరారు. చిత్ర పరిశ్రమపై విధించిన జీఎస్టీని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దీక్షకు పలువురు సీనియర్ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మద్దతు ప్రకటించారు.













