జై హనుమాన్ వచ్చేదప్పుడేనా?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన హను మాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా రిలీజైన హను మాన్ వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇండియా లో సూపర్ హీరో స్టోరీలకు ఇంకా మంచి డిమాండ్ ఉంటుందని హను మాన్ సినిమా నిరూపించింది.
హను మాన్ క్లైమాక్స్‌లో జై హనుమాన్ టైటిల్ తో పార్ట్-2 రానుందని లీడ్ ఇచ్చాడు డైరెక్టర్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ జై హను మాన్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేసి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తాడని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పాడు.
ఈ నేపథ్యంలో పలువురు స్టార్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఫలానా హీరో అని పేరును రివీల్ చేయలేదు. ఈ మూవీ 2025లో రిలీజ్ కానుందని అందరూ అనుకున్నారు కానీ జై హనుమాన్ గురించి రీసెంట్ గా తేజ సజ్జ క్లారిటీ ఇచ్చాడు. జై హనుమాన్ సినిమా రావడానికి టైమ్ పడుతుందని, ఈ లోపు తను వేరే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పష్టం చేశాడు. జై హనుమాన్ భారీ స్కేల్ లో రూపొందనుండటంతో విఎఫ్ఎక్స్ చాలా భారీగా ఉండనున్నాయట. దానికోసం ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి జై హనుమాన్ సినిమా రావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని చూచాయగా చెప్పాడు తేజ సజ్జ. అన్నీ కుదిరితే 2026లో జై హనుమాన్ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.













