ఆయన భావితరాలకు ఆదర్శం : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానక్‌రామ్‌గూడలోని సూపర్‌స్టార్ కృష్ణ నివాసానికి చేరుకుని ఆయన పార్ఠీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్ల ఆయనొక లెజెండ్ అని, సినీ పరిశ్రమలో దగ్గజమని కొనియాడారు. 44 ఏళ్లలో 353 చిత్రల్లో నటించడం గొప్ప విషయమన్నారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా పేరు పొందారని, ఏదైనా చేయాలంటే ధైర్యంగా ముందుకు వెళ్లేవారని, నిర్మాతగా మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న వ్యక్తి అని అన్నారు. తాను చదువుతున్న రోజుల్లో కృష్ణ తొలి సినిమా తేనె మనసులు చూశానని తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమా తీసి రికార్డు సృష్టించారని, ఎన్నో అవార్డులు అందుకున్నారని అన్నారు. సమాజ సేవ చేస్తూ రాజకీయాల్లో రాణించారని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమాన సంఘాలు కలిగిన ఏకైక నటుడు కృష్ణ అని అన్నారు. 1989లో పార్లమెంట్‌కు పోటీ చేసి గెలిచారని, ప్రజా సేవకు అంకితమై పని చేశారని, ఆయన భావితారలకు ఆదర్శమని ప్రశంసించారు. మహేశ్ బాబు కుటుంబంలో ఈ ఏడాది ముగ్గురు చనిపోవడం నిజంగా బాధాకరం. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని అన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.













