రివ్యూ : ‘టాక్సీవాలా’ తో సరదా ప్రయాణం

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానెర్లు : జి.ఎ.2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, యమున, ఉత్తేజ్, మధు నందన్,
రవివర్మ, రవిప్రకాష్, కళ్యాణి, సిజ్జు మీనన్, చమ్మక్ చంద్ర, పంకజ్ కేసరి తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్, మాటలు: సాయికుమార్‌రెడ్డి
నిర్మాత: ఎస్.కె.ఎన్., రచన, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్
విడుదల తేదీ: 17.11.2018
‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ దేవరకొండ తో యు వి క్రియేషన్స్ సమర్పణ లో జి.ఎ.2 పిక్చర్స్ పతాకంపై ప్రముఖ సినీ పి ఆర్ ఓ, ఎస్ కె ఎన్ నిర్మించిన ‘టాక్సీవాలా’ మంచి అంచనాలతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఈ హారర్ థ్రిల్లర్ ఎలాంటి ఫలితాన్నిచ్చింది? టాక్సీవాలాగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకున్నారు? అనే విషయాలు సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఎంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన శివ(విజయ్ దేవరకొండ) జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్‌లోని తన ఫ్రెండ్(మధునందన్) దగ్గరకి వస్తాడు. అతను చూపించిన రెండు, మూడు జాబ్స్ శివకి శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వవు. ఒక టాక్సీ కొనుక్కొని క్యాబ్ డ్రైవర్‌గా సెటిల్ అవ్వమని ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ఒక పాత కారుని కొని టాక్సీ డ్రైవర్‌గా మారతాడు. ఆ టైమ్‌లోనే అతనికి అను(ప్రియాంక జవాల్కర్) పరిచయమవుతుంది. పరిచయం కాస్తా ప్రేమ వరకు వెళుతుంది. శివ లైఫ్ ఇలా హ్యాపీగా గడిచిపోతున్న సమయంలో అతని కారులో కొన్ని నమ్మశక్యంకానీ ఘటనలు జరుగుతాయి. అతని కారులో ప్రయాణించిన ఒక డాక్టర్ ఊహించని విధంగా యాక్సిడెంట్‌కి గురై చనిపోతాడు. దాంతో షాక్ అయిన శివ ఈ మిస్టరీని తెలుసుకునేందుకు కారు అమ్మిన ఓనర్‌ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, అతను అందుబాటులో ఉండడు. ఫ్రెండ్స్‌తో కలిసి దొంగతనంగా ఆ ఓనర్ ఇంటిలో ప్రవేశిస్తాడు. అక్కడ చనిపోయిన డాక్టర్ ఫోటోని చూస్తాడు. అంతేకాకుండా ఒక ప్రొఫెసర్(రవివర్మ) బంధింపబడి ఉంటాడు. చివరికి ఆ కారులో సిశిర(మాళవిక నాయర్) అనే అమ్మాయి ఆత్మ ఉందని తెలుసుకుంటాడు శివ. ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఆమెకు హెల్ప్ చెయ్యాలనుకుంటాడు. ఆ అమ్మాయి ఆత్మ కారులోనే ఎందుకు ఉంది? ఆ డాక్టర్‌ని ఎందుకు చంపింది? ప్రొఫెసర్‌ని ఎందుకు బంధించారు? సిశిర ఆత్మ ఏం కోరుకుంటోంది? సిశిర ఆత్మ శాంతించేందుకు శివ ఏం చేశాడు అనేది తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:
క్యాబ్ డ్రైవర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓ ఆర్డనరీ కుర్రాడిగా కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో అక్కడక్కడా నవ్విస్తూనే.. ఇటు ఆ హర్రర్ సీన్స్ లో భయపడుతూ.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకిగా నటించిన ప్రియాంక జవాల్కర్ జూనియర్ డాక్టర్ అను పాత్రలో చాలా చక్కగా నటించింది. ఆమె క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ లో మరియు హీరోతో సాగే కొన్ని సన్నివేశాల్లోనూ తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోయినా .. తన నటనతో సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. మధు, మధు పక్కన అసిస్టెంట్, అలాగే చమ్మక్ చంద్ర తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్విస్తారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఇక డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ గురించి చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ కథను రెడీ చేసుకున్నారు. కథకు తగ్గ సీన్స్ రాసుకొని దానికి కామెడీని కూడా జోడించి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే మర్డర్ సీన్ ఆడియన్స్‌కి ఉత్కంఠ కలిగిస్తుంది. నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోందనేది ప్రేక్షకులు ఊహించలేని విధంగా పకడ్బందీగా సినిమాని నడిపించారు. హారర్ థ్రిల్లర్స్‌కి సినిమాటోగ్రఫీ, సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే సుజిత్ సారంగ్ మంచి ఫోటోగ్రఫీని అందించారు. సిట్యుయేషన్‌కి తగిన లైటింగ్‌తో విజువల్‌గా ఆడియన్స్‌ని మంచి మూడ్‌లోకి తీసుకెళ్ళారు. జేక్స్ బిజోయ్ చేసిన పాటలు బాగున్నాయి. కథతోపాటే వెళ్ళే పాటలు కావడంతో ఆడియన్స్ ఏ దశలోనూ బోర్ ఫీల్ అవ్వరు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాని ఒక లెవల్‌కి తీసుకెళ్ళారు జేక్స్. ఈ సినిమాని 2 గంటల 12 నిమిషాలకు ఎడిట్ చేసి సినిమా స్పీడ్‌గా వెళ్లడానికి కారకులయ్యారు ఎడిటర్ శ్రీజిత్ సారంగ్. నిర్మాత ఎస్.కె.ఎన్. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు.
విశ్లేషణ:
తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంచుకున్న దర్శకుడు రాహుల్, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సూపర్ నేచురల్, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తయారు చేసుకున్న లైన్ కావటంతో లాజిక్‌ల గురించి మాట్లాడుకోవటం అనవసరం. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యం ఫస్ట్ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ఎంటర్‌టైన్మెంట్ కాస్త తగ్గినా మార్చురీ సీన్ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్ సారంగ్ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు.సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు. ఆ లైన్ కి చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి కామెడీ సీన్స్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. అయితే.. దర్శకుడు సినిమాని చాలా చోట్ల ఎంటర్ టైన్ గా నడిపినప్పటికీ, లవ్ స్టోరీని మాత్రం ఆ స్థాయిలో మలచలేకపోయారు. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ విషయంలో ఇంకొంచెం శ్రద్ద తీసుకుని ఉండి ఉంటే బాగుండేది. దీంతో పాటు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత కూడా ఎక్కువుగా కనిపిస్తోంది.
తీర్పు:
ఇక విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ప్రియాంక నటన కూడా చాలా బాగుంది. కీలక పాత్రలో కనిపించిన మాళవిక నాయర్ కి పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. తన నటనతో సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తం మీద ఈ చిత్రం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మిగిలిన వర్గాల ప్రేక్షకులని కూడా అలరిస్తుందని చెప్పొచ్చు.