విజయ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్?
సినిమాల ద్వారా ప్రజాదరణ పొంది ఆ తర్వాత రాజకీయాల్లో కూడా విజయం సాధించి ప్రజా సేవ చేసిన ఎంతోమంది సినీ ప్రముఖుల్ని మనం చూశాం. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల్లో, పదవుల్లో సినీ ప్రముఖులు ఉన్నారు. ఇక రాబోయే ఎన్నికల బరిలోకి దిగేందుకు కొన్ని కొత్త పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. తాజాగా తమిళ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇది తమిళ సినీ రంగంతోపాటు రాజకీయ ప్రముఖుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం విజయ్‌కి లేదని, సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు చేయడంలో కావాల్సిన న్యాయ సలహాల కోసం ఢిల్లీలోని ఓ ప్రముఖ న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టుగానీ, సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగానీ తండ్రీకొడుకుల్లో ఎవ్వరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమా గురించి చెప్పుకోవాల్సివస్తే… లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో `మాస్టర్` అనే సినిమా చేస్తున్నాడు విజయ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను లాక్డౌన్ అడ్డుకుంది. ఈ సినిమాను విడుదల చేసే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది.













