బాలయ్య నిర్మాతలకు తమన్నా షాక్
అఖండ, వీర సింహారెడ్డి విజయాలతో మాంచి జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కూడా ఎలాగైనా విజయం అందుకుని, హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు బాలయ్య. ఈ సినిమా ఈ ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, శ్రీలీల బాలకృష్ణకు కూతురుగా కనిపించనుందంటూ వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలని అనిల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్స్ లో నటించిన తమన్నా, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే సినిమాకు ప్లస్ మాస్ ఆడియన్స్ వచ్చే ఛాన్సుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట.
దీన్ని దృష్టిలో పెట్టుకుని తమన్నాను సంప్రదించిన మేకర్స్‌కు మిల్కీ బ్యూటీ పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క పాటకు రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్ ని తమన్నా డిమాండ్ చేసిందట. సినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్లకు కూడా ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వట్లేదని, కేవలం ఒక్క సాంగ్ కోసం ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం అవసరమా అని మేకర్స్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మరి బాలయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ అవకాశాన్ని తమన్నా చేస్తుందా లేదా అనేది చూడాలి.













