అందాల తారకు మరో సత్కారం
అందాల తార టబూ మరో సత్కారం అందుకోనుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఎంజెలీస్లో టబూను గౌరవించనున్నారు. ఆమె నటించిన అంధదూన్ చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. మొత్తం దేశంలోని తొమ్మిది భాషల చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రేక్షకులకు చూపించనున్నారు. ప్రాంతీయ చిత్రాలతో పేరు తెచ్చుకున్న టబూ అగ్ర కథానాయకుతో కలిసి నటించింది. సమాంతరంగా హిందీ చిత్రాల్లోనూ నటించిన అక్కడ నుంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె చాలా ఎంపికగా చేస్తున్న సినిమాలు బాగా పేరు తీసుకొస్తున్నాయి. ఆమె నటించిన హైడర్, దృశ్యం, అంధదూన్ తదితర చిత్రాలు ఘన విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
టబూను సత్కరించడంపై ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఎంజెలీస్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. చిత్రోత్సవాల కార్యనిర్వాహకులు క్రిస్టినా మరోడా మాట్లాడుతూ టబూను సత్కరించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. ఆమెను గౌరవించేందుకు ఇది సరైన సమయం. టబూ తన నటనలో సాహసాన్ని, స్వేచ్ఛను, ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆమె ఎంచుకునే చిత్రాల్లో తనదైన వ్యక్తిత్వం తెలుస్తుంది. అందంతో పాటు టబూ అభినయ ప్రతిభ గొప్పది అని చెప్పారు. ఏప్రిల్ 11న మొదలయ్యే ఈ చిత్రోత్సవాలు 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి.













