సైరా క్లైమాక్స్ లో ఓ కీలక నిర్ణయం
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం శరవేగంగా తెరకెక్కుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే క్లైమాక్స్ విషయంలో చిత్ర బృందం చాలా రకాలుగా ఆలోచించి చివరికి ఓ నిర్ణయం తీసుకుందని తెలిసింది. కాగా వాస్తవం ఆధారంగా సినిమాను తీస్తే విషాదకరంగా చిత్రాన్ని ముగించాలి. ఎందుకంటే నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యం ఉరి తీసి కోట గుమ్మానికి ఆయన తలను వేలాడ దీసింది. ఈ విషయం తోనే క్లైమాక్స్ తీస్తే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశపడతారని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే నరసింహారెడ్డి మరణంతో కాకండా ఆ మహనీయుడి స్ఫూర్తితో మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా ఆ తర్వాత కాలంలో వచ్చిన కొంతమంది విప్లవకారులను చూపించనున్నారని సమాచారం. అంటే అల్లూరి సీతారామరాజు కాలం నాటి విప్లవకారులన్నమాట. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్తో రామ్చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుక ప్రేక్షకుల ముందుకు రానుంది.













