కృతి సనన్ని టార్గెట్ చేసిన నెటిజన్లు
సుశాంత్ సింగ్ రాజ్పుత్, కృతి సనన్ కలిసి `రబ్తా` అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఇటీవల సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని గురించి కృతి ఏదైనా పోస్ట్ పెడుతుందేమోనని నెటిజన్లు ఎదురుచూశారు. కానీ, అలాంటిదేమీ చేయకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల పోస్టులతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. `నీకసలు హృదయం లేదా.. ఒక్క పోస్టు కూడా పెట్టలేవా` అంటూ కృతిని టార్గెట్ చేశారు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ సమయంలోనే ఆమె సోదరి నుపూర్ సనన్ రంగంలోకి దిగి కృతిని ట్రోల్ చేస్తున్న వారందరిపైనా విరుచుకుపడింది. తాను, తన సోదరి సుశాంత్ మృతి పట్ల ఎంతో కుంగిపోయామని, దాని కోసం పోస్టులు పెట్టాల్సిన పనిలేదని సమర్థించింది.
కృతి ప్రవర్తన అలా ఉంటే సుశాంత్ కలిసి అతని చివరి సినిమా `దిల్ బెచారా`లో నటించిన సంజనా సంఘి.. సుశాంత్ మరణవార్తను జీర్ణించుకోలేకపోయింది. మొదట ఈ వార్త విని నమ్మలేకపోయానని, ఎవరైనా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చే్స్తున్నారేమోనని వెబ్సైట్స్ అన్నీ వెతికానని తెలిపింది. సుశాంత్ మృతిపై ఎలా స్పందించాలో, ఏం చెప్పాలో తెలియడం లేదని తన బాధను వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే సుశాంత్ మరణ వార్త విని అతని వదిన మృతి చెందిన విషయం అందర్నీ కలచివేసింది. సుశాంత్ అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. ఈలోపే అతని వదిన కూడా మృతి చెందడంతో బంధువర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ వదిన ఈ మరణవార్త వినేసరికి మరింత కుంగిపోయింది. ఆ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది.













