అంతరిక్షం అంటే ఎంతో మక్కువ.. అందుకే చంద్రుడిపై స్థలం కొన్నాడు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైనా బ్రతికి ఉన్నప్పటి కంటే చనిపోయిన తర్వాతే అతని వ్యక్తిత్వం గురించి చెప్పకుంటారు. ఇప్పుడు సుశాంత్ విషయంలో కూడా అదే జరుగుతోంది. అతని సన్నిహితులు ఎవరు, అతని అలవాట్లు ఏమిటి? అతను దేన్ని ఎక్కువగా ఇష్టపడే వాడు వంటి ఎన్నో కొత్త విషయాలు సన్నిహితుల ద్వారా, బంధువుల ద్వారా వెల్లడి అవుతున్నాయి. వాటిలో వింతైన విషయం తెలిసింది. అదేమిటంటే అతనికి చిన్నతనం నుంచి అంతరిక్ష విశేషాలు తెలుసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అతని సోషల్ మీడియా ఎకౌంట్లో కూడా ఎక్కువగా అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలే ఉంటాయి. అందుకే చంద్రడిపై అతను స్థలం కొన్నాడు. చంద్రుడిపై స్థలం కొన్న ఏకైక హీరో సుశాంత్ కావడం విశేషం. ఈ స్థలాన్ని లూనార్ లాండ్ రిజిస్ట్రీ నుంచి కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చంద్రుడిపై స్థలాలను అమ్ముతున్నది వీళ్లే. గతంలో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ అభిమాని చంద్రుడిపై స్థలం కొని అతనికి గిఫ్ట్‌గా ఇచ్చాడు.
మరోపక్క సుశాంత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ఎంతో మంది సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సుశాంత్ మృతికి పరిశ్రమలో ఉన్న వారసత్వం, బంధుప్రీతి కారణమంటూ కరణ్ జోహార్, ఆలియా భట్లను ట్రోల్ చేస్తూ వాళ్ళ సినిమాలను చూడొద్దంటున్నారు నెటిజెన్లు. కరణ్ జోహార్ వల్లే సుశాంత్‌కు మరో బేనర్లో సినిమా చేసే అవకాశం రాలేదని, సుశాంత్ మృతికి అదే కారణమని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండాలని చూసే రామ్‌గోపాల్‌వర్మ వారసత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను కొట్టిపారేశారు. వారసత్వం అనే పదాన్ని సినిమా ఇండస్ట్రీకే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వర్మ. వారసత్వం, బంధుప్రీతి అనేది అన్ని పరిశ్రమల్లోనూ ఉందని, కాకపోతే ఇది గ్లామర్ ప్రపంచం కాబట్టి అందరి దృష్టీ దీనిపైనే ఉంటుందని వివరించారు.













