సుశాంత్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఇవేనా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ని ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. వరసగా సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవరూ నమ్మడం లేదు. అతను మానసిక ఒత్తిడితోనే ఇలా చేశాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అతని మానసిక ఒత్తిడికి కారణాలు ఏమిటి అంటే ఇండస్ట్రీలోని రాజకీయాలే దానికి కారణం అని కొందరు బాలీవుడ్ ప్రముఖులు చెప్తున్నారు. బాలీవుడ్లో వారసత్వం అనేది ఎప్పటి నుంచో ఉంది. దానివల్ల ఎంతో మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో కంగనా రనౌత్ కూడా ఇదే విషయంపై వ్యాఖ్యలు చేసింది. ఎన్నో సినిమాలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్న సుశాంత్ ఓ ఇంటర్వూలో ఇదే బాధను వ్యక్తం చేశాడు. తనను ఎవరూ పార్టీలకు పిలవరని, బాలీవుడ్ ఇండస్ట్రీ తనను ఫ్యామిలీ మెంబర్‌గా గుర్తించడం లేదని అన్నాడు. ఓ సినిమాలో సుశాంత్ చనిపోయే సన్నివేశం ఉండడం వల్ల ఆ సినిమా తను చూడను అని ఓ అభిమాని ట్వీట్ చేసింది. దానికి స్పందించిన సుశాంత్.. తనకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరని, తన అభిమానులే గాడ్‌ఫాదర్ అని, మీరు సినిమా చూడకపోతే ఇండస్ట్రీ తనను బయటికి గెంటేస్తుందని ట్వీట్ చేశాడు. అప్పటికి అది సరదాగా అనిపించినా అతని ఆత్మహత్య తర్వాత ఆ ట్వీట్లో ఉన్న బాధ ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. అంతా అయిపోయిన తర్వాత తన సమస్య ఏమిటో మాకు చెబితే సాయం చేసేవాళ్ళం అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. అయితే అవన్నీ వట్టి మాటలని, ఇక్కడ ఎవరూ ఎవరికీ సాయం చేయరని బాలీవుడ్ నిర్మాత కెఆర్కె వ్యాఖ్యానిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలోని ప్రముఖులంతా అనవసరమైన మాటలతో హడావిడి చేస్తున్నారంటూ దర్శకుడు వివేక్రంజన్ అంటున్నాడు.
ఏది ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యంగ్ హీరో ఇలా ఆత్మహత్యకు పాల్పడడం మాత్రం బాలీవుడ్‌లోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకనైనా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, అందరూ కూర్చొని ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.













