ఇద్దరు హీరోలు కాదన్న కథతో బ్లాక్‌బస్టర్
సినిమా రంగం అంటేనే మాయా ప్రపంచం అంటుంటారు కొందరు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని విజయం వరిస్తుందో, ఎవరిని వెనక్కి నెట్టేస్తుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి కథను సినిమాగా తీస్తే విజయం సాధిస్తుందా? లేదా? అనే విషయాన్ని అంత ఈజీగా ఎవరూ జడ్జ్ చెయ్యలేరు. ఎందుకంటే ఇది కమర్షియల్ ఇండస్ట్రీ. సినిమా బాగుంటే సరిపోదు కాసులు కూడా రావాలి. అప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు భావిస్తారు. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అద్భుతంగా ఉందంటూ అందరూ కితాబులిస్తారు. కానీ, ఆ నిర్మాతకు నష్టమే మిగులుతుంది. కొన్ని సినిమాలను చూసి ఏం వుంది సినిమాలో అంటూ పెదవి విరుస్తారు. కానీ, అదే బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో సినిమాల విషయంలో జరిగాయి.
విషయానికి వస్తే ఒక దర్శకుడు రాసుకున్న కథను కొంతమంది హీరోలు రిజెక్ట్ చేస్తే అదే కథతో వేరే హీరో సినిమా చేస్తే సూపర్‌హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణగా చెప్పుకోవాంటే ‘అతనొక్కడే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సురేందర్‌రెడ్డి తొలి చిత్రంతో ఘనవిజయం సాధించినప్పటికీ ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు అశోక్, అతిథి కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. నాలుగో సినిమా కోసం ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకొని ఓ కథను సిద్ధం చేశాడు సురేందర్. అయితే ఆ కథతో సినిమా చేయడానికి ప్రభాస్ తిరస్కరించాడు. అదే కథను ఎన్టీఆర్‌కు కూడా వినిపించాడు సురేందర్. ఎన్టీఆర్ కూడా సినిమా చేయడానికి సుముఖంగా కనిపించలేదు. ఆ టైమ్‌లో రవితేజ ఈ కథను ఓకే చేశాడు. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. అదే ‘కిక్’ చిత్రం. 2009లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 25 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న థమన్ ఈ సినిమాతోనే పరిచయమయ్యాడు. ‘కిక్’ సూపర్‌హిట్ కావడంతో తన తప్పు తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే సురేందర్‌రెడ్డితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమాయే ‘ఊసరవెల్లి’.













