విజయ్ సినిమాలో బాలీవుడ్ హీరో!
ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాన్ ఇండియా సినిమాలు చిత్ర పరిశ్రమ పుంజుకోవడానికి ఎంతో అవసరం. దానికి తగ్గట్టుగానే దేశంలోని ప్రధాన భాషల్లో తమ సినిమాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. దేశంలోనే ఎక్కువ సినిమాల నిర్మాణం జరిగేది టాలీవుడ్లోనే అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల నిర్మాణం కూడా ఇక్కడే ఎక్కువ జరగనుండడం విశేషం. ఇప్పటికే కొంతమంది హీరోలు తాము చేసే ప్రతి సినిమా ఎక్కువ భాషల్లో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే కథలను, దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు. అర్జున్‌రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కూడా పలు భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనన్య పాండే ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా నటిస్తోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ముంబయ్‌లోనే జరగాలి. అందుకే 40 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్.
మరో షెడ్యూల్ కూడా అక్కడే చెయ్యాల్సి ఉండగా కరోనా షూటింగ్‌ను బ్రేక్ చేసింది. దేశంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్న నగరంగా ముంబయ్ పేరు పొందింది. దీంతో అక్కడ షూటింగ్ చేసేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది చిత్ర యూనిట్. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే పాపులర్ ఫేస్ ఒకటి సినిమాలో ఉండాలనుకున్న పూరి దానికి సునీల్షెట్టిని ఎంచుకున్నాడు. ఓ డాన్ పాత్ర కోసం సునీల్‌శెట్టిని సంప్రదించగా, కథ, సినిమాలోని తన పాత్ర గురించి తెలుసుకున్న సునీల్ తన అంగీకారాన్ని తెలియజేశాడు.
సినిమాలో ఎంతో కీలకమైన సునీల్ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందట. షూటింగులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతలు షూటింగ్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ, ఇప్పుడిప్పుడే అన్ని భాషల హీరోలు కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఫైటర్ సినిమా షూటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.
తాజా సమాచారం మేరకు త్వరలోనే విదేశాలలో ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభమవుతుందట. అంతకంటే ముందు హైదరాబాద్‌లో నిర్మించిన సెట్లో ముంబయ్‌లో చెయ్యాల్సిన టాకీపార్ట్‌ను కంప్లీట్ చేస్తారట. ఫైటర్ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయ్‌దేవరకొండకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.













