ఈ సినిమా అయినా సందీప్ కు బ్రేక్ ఇస్తుందా?
ఎంతో కాలం నుంచి సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కు రీసెంట్గా మైఖేల్ ఊహించని షాక్ ఇచ్చింది. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా డైరెక్టర్ గ్యాంగ్ స్టర్ క్లాసిక్స్ ని ఎక్కువ స్పూర్తిగా తీసుకోవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఇప్పుడు సందీప్ కిషన్ తన ఆశలన్నీ ఊరి పేరు భైరవకోన అనే సినిమాపై పెట్టుకున్నాడు.
తనకు గతంలో టైగర్ రూపంలో మంచి సక్సెస్ ఇచ్చిన విఐ ఆనంద్ తో మరోసారి చేతులు కలిపాడు సందీప్. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి డిఫరెంట్ మూవీస్ తో అలరించిన వీఐ ఆనంద్ ఒక్క క్షణం, డిస్కో రాజా సినిమాలకు మంచి ఫలితం రాకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
గరుడపురాణంలోని మాయమైన నాలుగు పేజీల వల్ల భైరవకోన అనే ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తాయన్నదే ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఊరి లోపలికి వెళ్లడమే కానీ బయటకు రావడం ఉండని ఆ ప్రమాదకరమైన చోటు వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ మిస్టరీని హీరో ఎలా ఛేదించాడనేలా సినిమా నడవనుంది. కాకపోతే టీజర్ చూస్తుంటే ఇటీవలే వచ్చిన విరూపాక్ష పోలికలు ఈ సినిమాలో కనిపిస్తున్నయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్, హత్యలు కూడా ఉన్నట్లున్నాయి.
ఎలాగూ టీజర్ కు మంచి రెస్పన్స్ వచ్చింది. సినిమాలో కంటెంట్ బాగుండి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మాత్రం సందీప్ కిషన్ కు ఈ సినిమా బ్రేక్ ఇచ్చినట్లే అవుతోంది. యూత్ హీరోలంతా రెగ్యులర్ లవ్ స్టోరీలు వర్కవుట్ కావట్లేదని ఇలాంటి డిఫరెంట్ స్టోరీలు ట్రై చేయడం బాగానే ఉంది కానీ అన్నీ ఇలాంటి తరహా కథలే అయితే సినిమాలు బెడిసే కొట్టే ప్రమాదం కూడా ఉంది.













