కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్‌తో సందీప్ కిషన్
కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి హిట్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఇలాంటి సినిమాలు కేవలం తమిళ, మలయాళ, బెంగాలీ డైరెక్టర్లు మాత్రమే చేయగలరన్న అభిప్రాయన్ని తప్పని ఋజువు చేస్తూ కేరాఫ్ కంచరపాలెంతో నిరూపించాడు. దీంతో వెంకటేష్ పై అంచనాలు బాగా పెరిగాయి.
అయితే ఆ తర్వాత వెంకటేష్ ఇప్పటివరకు ఒరిజినల్ కథతో సినిమా చేయలేదు. రెండో సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూమస్య చేసినప్పటికీ అది రీమేక్ మూవీ. తర్వాత తన ప్రొడక్షన్ లో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ కూడా రీమేక్ సినిమానే. మొన్నామధ్య మర్మాణువు అనే సినిమాను అనౌన్స్ చేశాడు కానీ మళ్లీ దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇక అసలు విషయానికొస్తే, వెంకటేష్ అతి త్వరలోనే తన ఒరిజినల్ కథతో పేరున్న హీరోతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన సినిమాతో రిలీజ్ కు రెడీ అయిన సందీప్ కిషన్, ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తన తర్వాతి సినిమాను వెంకటేష్ మహాతో చేయబోతున్నానని, ఓ పేరున్న నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రానుందని కూడా సందీప్ తెలిపాడు.













