Sundar: నా సినిమాలు పిల్లలు చూస్తారు.. అందుకే ఆ సీన్లు పెట్టను
కోలీవుడ్ లో నటుడిగా, డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుందర్(Sundar C) ఇప్పటికే తన దర్శకత్వంలో పలు సినిమాలు చేసి ఆడియన్స్ ను మెప్పించారు. ఈ ఇయర్ మద గజ రాజా(mada gaja raja) తో సక్సెస్ ను అందుకున్న సుందర్ ఇప్పుడు గ్యాంగర్స్(gangers) అనే సినిమాతో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. ఈ సినిమాలో సుందర్, వడివేలు(vadivelu) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఏప్రిల్ 24న గ్యాంగర్స్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుందర్ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుందర్ ను తన సినిమాల్లోని గ్లామర్, అసభ్యత గురించి ప్రశ్నించగా దానికి సుందర్ తనదైన శైలిలో స్పందించారు. తన సినిమాల్లో అవసరానికి మించి గ్లామర్ ఉంటుందనే విమర్శలపై సుందర్ రెస్పాండ్ అయ్యారు.
తన సినిమాల్లో హీరోయిన్లను మరింత అందంగా చూపించాలని కోరుకుంటానని, గ్లామర్ కోసం తానెప్పుడూ అవసరం లేని సన్నివేశాలను సినిమాలో పెట్టలేదని చెప్పిన అతను తన సినిమాల్లో హింస, రక్తపాతాలు ఉండవని తెలిపారు. తాను కథ రాసుకునేటప్పుడే సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండకూడదని అనుకుంటానని, తన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు చూస్తారు కాబట్టి ఎలాంటి రేప్ సీన్స్ ను తాను సినిమాలో పెట్టనని చెప్పారు. సుందర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి






