బన్ని, సుకుమార్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. ఎందుకో?
ఈ ఏడాది చివరి బ్లాక్‌బస్టర్ మూవీ `అల వైకుంఠపురములో`. సంవత్సరం ఆరంభంలో సినిమా పరంగా, మ్యూజికల్‌గా ఘనవిజయం సాధించిన ఏకైక సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా బన్ని ఫ్యాన్స్‌కి మంచి జోష్ నిచ్చింది. లాక్డౌన్ అనేది లేకపోతే ఇప్పటికి బన్ని చేసే సినిమాల లిస్ట్ భారీగానే ఉండేది. గత ఆరునెలలుగా షూటింగులు లేకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న `పుష్ప` కూడా ఆగిపోయింది. పలు భారతీయ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న `పుష్ప` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్ని పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లోనే ఉంటున్న నేపథ్యంలో షూటింగ్ కోసం ఎన్నో లొకేషన్స్‌ను చూశారు. కేరళలోని అడవుల్లో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. లాక్డౌన్ వచ్చి పడడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇటీవల షూటింగులకు అనుమతులు రావడం, ఒక్కొక్కరుగా హీరోలు షూటింగ్ చేయడానికి ముందుకు వస్తుండడంతో కేరళ అడవులకు ప్రత్యామ్నాయంగా వికారాబాద్ అడవుల్ని ఎంపిక చేసుకున్నారని, షూటింగ్ కూడా చేస్తున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. నిజానికి ఇప్పటివరకు ఎక్కడ షూటింగ్ చేయాలనే విషయంలో ఒక క్లారిటీకి రాలేదు సుకుమార్.
ప్రస్తుతం బన్నితోపాటు బన్ని కుటుంబ సభ్యులు, సుకుమార్, చిత్ర యూనిట్ లొకేషన్స్‌ను వెతికే పనిలో పడ్డారు. ఆదిలాబాద్, మహారాష్ట్రలలో కొన్ని లొకేషన్స్‌ను చూశారు. శనివారం కుంటాల జలపాతాన్ని సందర్శించిన యూనిట్ ఇప్పుడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో పర్యటిస్తున్నారట. తాము ఏయే లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలో పక్కాగా డిసైడ్ అయిన తర్వాత నాన్‌స్టాప్‌గా ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది షూటింగ్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాదికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బన్ని, సుకుమార్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.













