‘సూసైడ్ ఆర్ మర్డర్’… మరో బయోపిక్ కి రంగం సిద్ధం!
ఈమధ్యకాలంలో బయోపిక్‌ల హవా పెరిగింది. ఎంతోమంది ప్రముఖుల జీవిత కథల ఆధారంగా సినిమాలు నిర్మిస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలయ్యాయి కూడా. మరికొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. కల్పిత కథలతో సినిమాలు రూపొందించడం కంటే యదార్థ ఘటనల ఆధారంగా, జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీస్తే ఆదరణ ఎక్కువగా ఉంటుందని కొన్ని సినిమాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖుల జీవిత కథలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రూపుదిద్దుకోబోతోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితాన్ని ఆధారం చేసుకొని ఓ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా.
ఒక హీరో, అందులోనూ బిజీగా ఉన్న హీరో ఆత్మహత్య చేసుకోవడం అనేది అందర్నీ షాక్‌కి గురి చేసింది. ముఖ్యంగా సుశాంత్ అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం సుశాంత్‌కు లేదని, పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మొదట దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఆత్మహత్యగా ధృవీకరించారు. అయినా ఇది హత్యేనన్న అనుమానం చాలా మందిలో ఉంది. అందుకే పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లను కూడా పోలీసులు విచారించారు. సుశాంత్‌తో సంబంధం ఉన్న ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులను ప్రత్యేకంగా ఎంక్వయిరీ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు నుంచి ఈరోజు వరకు జరిగిన కొన్ని ఘటనలను చూస్తే ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తుంది.
బాలీవుడ్ నిర్మాత విజయ్‌శేఖర్ గుప్తా ఎన్నో మలుపులతో కూడిన సుశాంత్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా `సూసైడ్ ఆర్ మర్డర్` అంటూ సినిమాను ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశాడు. సుశాంత్‌ని పోలిన సచిన్ తివారి ఈ సినిమాలో సుశాంత్ పాత్రను పోషించనున్నాడు. అసలు ఈ సచిన్ తివారి ఎవరు అనే విషయం గురించి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చని సుశాంత్ ఎలా బాలీవుడ్‌కు ఎలా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అతని అవకాశాలు తగ్గడానికి గల కారణాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ముఖ్యంగా నెపొటిజం గురించి ఈ సినిమాలో తీవ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుంది. ముంబై, పంజాబ్‌తోపాటు బీహార్‌లోని కొన్ని లొకేషన్లలో షూటింగ్ జరుపుతారు. ఇందులో సుశాంత్ కథతోపాటు అతనితో సంబంధం ఉన్న పదిమంది కథలను కూడా పొందుపరుస్తున్నారు. అలాగే సుశాంత్ మృతితో సంబంధం ఉన్న పలువురి క్యారెక్టర్స్ ఇందులో కనిపిస్తాయి.













