నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న రైటర్లు
మనుషుల్లో మాములుగానే కాదు, సినిమా చూసే విధానంలో కూడా చాలా మార్పులొచ్చాయి. ఒకప్పుడు స్టార్స్ ఉంటే చాలు సినిమాను హిట్ చేసేవారు. కానీ ఇప్పుడు స్టార్ యాక్టర్స్ ఉన్నా కంటెంట్ ఉంటేనే సినిమాను ఆదరిస్తున్నారు. దీంతో మంచి స్టోరీలున్న సినిమాలకు, కంటెంట్‌కు టాలీవుడ్లో బాగా డిమాండ్ పెరిగింది.ఆ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకున్న రైటర్స్ నిర్మాతల దగ్గర నుంచి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
దీంతో ఇప్పటికే మంచి రైటర్స్‌గా పేరున్న వాళ్లు పాన్ ఇండియన్ ఫిల్మ్స్‌కు స్టోరీలు వండుతూ ఒక్కో స్టోరీకి కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ, మంచి స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగానే కొంతమంది రైటర్స్ భారీగా డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలకే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో రీసెంట్ గా సక్సెస్‌లు సొంతం చేసుకుంటున్న రైటర్స్ నిర్మాతల నుంచి ఎక్కువ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను సొంతం చేసుకుంటున్న రచయితలు కూడా ఇప్పుడు కోటి నుంచి రెండు కోట్ల వరకు డిమాండ్ చేయడంతో పాటుగా తమ టీమ్ హోటల్ ఖర్చులను కూడా నిర్మాతలపైనే వేస్తున్నారట. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటం, ఆ రైటర్స్‌కు తిరుగు లేకపోవడంతో కోరినంత ఇవ్వడం తప్ప ఆ ప్రొడ్యూసర్స్ కూడా చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది.
ప్రతి శుక్రవారం స్టార్ రేంజ్ మారిపోయే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ రాగానే ఆఫర్లు వెంటనే క్యూ కడుతున్నాయి. అదే సక్సెస్ బ్యాక్ టు బ్యాక్ వరిస్తే ఇక చెప్పే పన్లేదు. వారు చెప్పిందే వేదం. ఎప్పుడూ లేనిది ఈ రైటర్ల డిమాండ్ చూసి సదరు నిర్మాతలు నోరెళ్ల బెట్టక తప్పన పరిస్థితి.













