అక్షయకుమార్, నాగార్జున ఇచ్చిన స్ఫూర్తితో మిగతా స్టార్ హీరోలు కూడా ముందుకొస్తారా?
కరోనా వల్ల దేశవ్యాప్తంగా అన్ని రంగాలకూ నష్టం వాటిల్లింది. అందులో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో చాలా సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని వేల కోట్లు పెట్టుబడిగా పెట్టి ఉన్నారు. ఇప్పడు లాక్డౌన్ వల్ల షూటింగులు లేకపోవడం, థియేటర్స్ మూత పడడంతో చిత్ర పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయింది. కేంద్రపభుత్వం షూటింగులకు అనుమతులు ఇచ్చినా పెద్ద హీరోలు షూటింగ్ చేయడానికి భయపడుతున్నారు. షూటింగ్ సమయంలో ఒక్కరికి కరోనా సోకినా తాము బాధ పడాల్సి వస్తుందని వారి ఆలోచన. ఇప్పుడు అన్‌లాక్ 4.0 ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కొంతమంది షూటింగ్ చేయడానికి ముందుకొస్తున్నారు.
అయితే స్టార్ హీరోల్లో మొదట షూటింగ్ చేయడానికి ముందుకొచ్చింది అక్షయ్‌కుమార్. ఆ తర్వాత కరోనా బారినుంచి బయటపడి కెబిసి షూటింగ్లో పాల్గొంటున్నారు అమితాబ్. టాలీవుడ్ విషయానికి వస్తే మొదట షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు నాగార్జున. ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్‌తోపాటు బిగ్‌బాస్ సీజన్ 4 షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. మిగతా పెద్ద హీరోలెవరూ షూటింగ్ చేయడానికి ముందుకు వస్తున్న సూచనలు లేవు. ఏది ఎలా ఉన్నా జనవరి తర్వాతే షూటింగ్‌కి వస్తామని చెప్తున్నారు. ఐదు నెలలుగా చిత్ర పరిశ్రమ స్తంభించిపోవడంతో నిర్మాతలు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. జనవరి తర్వాత షూటింగ్ అంటే మరో నాలుగు నెలలపాటు వారికి ఈ కష్టాలు తప్పవు. నిర్మాతలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అక్షయ్‌కుమార్, నాగార్జున వంటి హీరోలు షూటింగ్ చేయడానికి ముందుకు వచ్చి మిగతా హీరోలకు ఇన్స్పిరేషన్గా నిలిచారని సినీవర్గాలు ప్రశంసిస్తున్నాయి. వీరిని చూసైనా మిగతా హీరోలు షూటింగులు చేసేందుకు ముందుకు వస్తారేమో చూడాలి. మరో పక్క పుష్ప షూటింగ్ కోసం వికారాబాద్ అడవుల్ని ఎంపిక చేసుకున్న సుకుమార్ కొంత షూటింగ్ పార్ట్ అక్కడే చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ వైష్ణవ్‌తేజ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న చిత్రం షూటింగ్ వికారాబాద్ అడవుల్లోనే ప్రారంభమైంది. అయితే సెట్స్‌లో ఒకరికి కరోనా సోకిందని షూటింగ్ నిలిపి వేశారు. వికారాబాద్ అడవుల్లోనే షూటింగ్ చెయ్యాలని డిసైడ్ అయిన సుకుమార్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి.













