అందుకు మేం సిద్ధంగా లేమంటున్న స్టార్ హీరోలు?
చిత్ర పరిశ్రమ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. షూటింగులు లేక, పనులు లేక అల్లాడుతున్న సినీ కార్మికులకు చల్లని వార్త చెప్పారు. ఇప్పుడు 24 క్రాఫ్టుల వారికి చేతినిండా పని ఉండే అవకాశం ఉందని అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో షూటింగులు చేయడానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? ముఖ్యంగా స్టార్ హీరోలు ఈ సమయంలో షూటింగ్‌కి ఓకే చెప్తారా? అనేది పెద్ద ప్రశ్న. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టాలీవుడ్‌లోని కొందరు టాప్ హీరోలు ఇప్పట్లో సెట్స్‌కి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. స్టార్ హీరోలే కాదు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ కూడా కొంతకాలం కెమెరా ముందుకు రాకుండా ఉంటేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో షూటింగులు ఆగిపోవడం వల్ల ఆర్థికంగా పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు పరిశ్రమలోని అందరూ నష్టపోయారు. ఆ సమయంలో షూటింగులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, లాక్డౌన్లో చాలా సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటి సమయంలో షూటింగులు చేయడం వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరి అభిప్రాయం. ప్రతిరోజూ షూటింగ్ లొకేషన్‌కి రావడం, ప్యాకప్ చెప్పగానే మళ్లీ ఇంటికి వెళ్లడం.. ఈ జర్నీలో ఏ దశలోనైనా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అందుకే మరి కొంతకాలం వేచి చూడడం మంచిదని స్టార్ హీరోలు భావిస్తున్నారట. హీరోలే షూటింగ్ చేయడానికి సిద్ధంగా లేనపుడు దర్శకనిర్మాతలు మాత్రం ఏం చేస్తారు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇప్పట్లో కరోనా మనల్ని వదిలి వెళ్ళదన్న విషయం అందరికీ తెలుసు. ఈ వైరస్‌కి వ్యాక్సీన్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, అప్పుడే మానవాళి మనుగడకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సాధారణ ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండక తప్పదు. ఈ ముందు చూపుతోనే కొంతమంది హీరోలు షూటింగ్లో పాల్గొనడానికి మొగ్గు చూపించడం లేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో చిత్ర పరిశ్రమ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? కరోనాకి భయపడి షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా లేని హీరోలను ఎలా ఒప్పిస్తారో చూడాలి.













