అల్యూమినియం ఫ్యాక్టరీలో జక్కన్న పనులు
టాలీవుడ్ లో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న రాజమౌళి తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలొస్తున్నాయి.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ తో పాటూ మరో టాప్ హీరో కూడా నటిస్తున్నాడని, ఈ సినిమాలో ఇండోనేషియా భామ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తూనే ఉంది. తన సినిమాలను విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కించే రాజమౌళి,ఆ సినిమాల కోసం భారీ సెట్స్ ను నిర్మిస్తూ, ఓ రేంజ్ లో ఖర్చు పెడుతుంటాడు.
ఆ సెట్స్ లోనే రాజమౌళి కీలకమైన సీన్స్ ను తెరకెక్కిస్తుంటాడు. బాహుబలి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ ఇప్పటికీ విజిటర్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేసి సినిమాలోని మెయిన్ పార్ట్ అంతా అక్కడే షూట్ చేశారు. ప్రస్తుతం మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా అక్కడే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే చివరి నాటికి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను కంప్లీట్ చేసి, జూన్ నుంచి సినిమాను స్టార్ట్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.













