పది భాగాలుగా జక్కన్న మహాభారతం
మహాభారత గాథను వెండితెరపై తెరకెక్కించడమే తన డ్రీమ్ అని దర్శకధీరుడు రాజమౌళి ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పాడు. మగధీ, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో భారీ ప్రతిష్టాత్మక సినిమాలు చేసిన జక్కన్న, ఇవన్నీ కేవలం తాను మహాభారతం తీయడానికి ముందు తనకు తాను పెట్టుకున్న ట్రయల్లా చెప్తూ వచ్చాడు.
బాహుబలి స్టార్ట్ అయిన టైమ్ లో రాజమౌళి మహాభారతం గురించి మొదటిసారిగా మాట్లాడాడు. మహాభారతం లాంటి కథను సినిమాగా తీయాలంటే తనకు సుమారు పదేళ్ల అనుభవం కావాలని అప్పట్లో చెప్పాడు. చూస్తూ ఉండగానే పదేళ్లు దాటిపోయాయి. కానీ రాజమౌళి ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది లేదు. ప్రస్తుతం జక్కన్న ఫోకస్ అంతా మహేష్ బాబు తో చేయబోయే సినిమా మీదే ఉంది.
మహేష్ సినిమా తర్వాతైనా మహాభారతంను మొదలుపెడతాడా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇలాంటి సమయంలో రాజమౌళి తాను ఈ సినిమాను తీస్తే పది భాగాలుగా తీస్తానని హింట్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి దగ్గర మహాభారతం ప్రస్తావన వచ్చింది. టీవీలో ఆ కథను 260 ఎపిసోడ్లుగా తీశారని, మరి మీరు సినిమా చేస్తే ఎన్ని భాగాలుగా తీస్తారని ఓ వ్యక్తి ప్రశ్నించగా దానికి జక్కన్న ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
మహాభారతం గురించి భారతదేశంలో ఉన్న అన్ని వెర్షన్లనూ చదవడానికే సంవత్సరం పైగా పడుతుంది. అలాంటిది సినిమా తీస్తే పది భాగాలుగా తీయాల్సి ఉంటుందని నా అంచనా అని రాజమౌళి తన అభిప్రాయాన్ని చెప్పడంతో ఇది ఎంత మెగా ప్రాజెక్టో అని ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అంటే రాజమౌళి చెప్పిన ప్రకారం, ఈ సినిమాను ఆయన వెంటనే మొదలుపెట్టినా కూడా తన లైఫ్ లో మరే ఇతర సినిమా చేయకుండా జక్కన్న దీనికే అంకింతమై పోవాల్సి ఉంటుందేమో.













