రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ అవార్డును దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అందుకున్నారు. హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై అవార్డును రాజమౌళికి అందజేశారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అక్కినేని అవార్డు రాజమౌళి అందుకోవడం అభినందనీయమన్నారు. అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం ఉండాలని ఆకాంక్షిస్తూ, తెలుగు భాషను తప్పనిసరి చేసిన సీఎం కేసీఆర్‌ను అభినందించారు. తల్లి పాలు ఎంత శ్రేష్ఠమో, మాతృభాషా అంతే శ్రేష్ఠమని, తెలుగు భాష మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకూ అందించాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శకుడు రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దర్శకుడు రాజమౌళికి అరుదైన అక్కినేని అవార్డు అందించటం ముదావహమన్నారు. రాజమౌళి సృష్టించిన బాహుబలి ని అద్భుత కళాఖండంగా అభివర్ణించారు. అక్కినేని జీవితం అందరికీ ఆదర్శప్రాయం అంటూ, ఆయన తన ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని పెంచారని కీర్తించారు. సినీ పరిశ్రమకు తన ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అవార్డు అందుకున్న అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ మరణాన్ని శాసించిన మహానుభావుడు అక్కినేని పేరిట తీసుకున్న ఈ అవార్డుకు తాను అర్హుడినేనా? అని ప్రశ్నించుకున్నారు. అనేకసార్లు గుండెపోటు వచ్చినా తాను రమ్మన్నప్పుడే మృత్యుపు రావాలని శాసించిన వ్యక్తిగా తనకు అక్కినేని కనిపిస్తారని, అటువంటి వ్యక్తులు తనకు తెలిసి మహాభారతంలో భీష్యాచార్యులు వంటి గొప్పవారు ఉన్నరని కీర్తించారు.ఈ కలియుగంలో అంత గొప్ప వ్యక్తిగా అక్కినేని కనిపిస్తారని అన్నారు. అవార్డు ఇచ్చి నాగార్జున తనపై పెద్దభారాన్ని మోపారని రాజమౌళి చమత్కరించారు.













