చెన్నైలో అతిలోకసుందరి సంవత్సరీకం
అతిలోకసుందరిగా సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి మరణించి మరి 10 రోజులకు ఏడాది పూర్తవుతుంది. అయితే, తిథి ప్రకారం గురవారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో చెన్నైలో గురువారం ఆమె సంత్సరీకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వి, ఖుషీ, మరిది అనిల్ కపూర్ హాజరయ్యారు. చెన్నైలోని శ్రీదేవి ఇంటిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ తమిళ నటుడు అజిత్, ఆయన భార్య షాలిని కూడా హాజరయ్యారు. శ్రీదేవి, అజిత్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శ్రీదేవి నటించిన ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా తమిళ వెర్షన్లో అజిత్ అతిథి పాత్రలో కనిపించారు. అజిత్ ఓ సినిమా నిర్మించాలని శ్రీదేవి కూడా భావించారు. అయితే, సరైన కథ దొరకకపోవడంతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.













