శ్రీలీల క్రేజ్ కొనసాగుతుందా?
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అనే ముద్ర కొన్నాళ్లు మాత్రమే ఉంటుంది. ఎంతోమంది హీరోయిన్స్ వెండితెరపై తమ లక్ ను టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే వారిలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే స్టార్ హీరోయిన్స్ అవుతారు. టైర్1 హీరోలకు జంటగా ఛాన్సులు అందుకుంటారు. కాజల్, తమన్నా పదేళ్ల పాటు హీరోయిన్స్ గా సౌత్ లో చలామణి అయ్యారు.
తర్వాత సమంత పదేళ్ల పాటు దూసుకెళ్లింది. రకుల్ ఓ ఐదేళ్ల పాటూ మంచి క్రేజ్ లో ఉంది. తర్వాత పూజా హెగ్డే కూడా మంచి అవకాశాలను అందుకుంటూ రాణించింది. ప్రస్తుతం రష్మిక మందన్నా ఈ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది. సౌత్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.
ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి సందడి-2 అనే చిన్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. నాలుగేళ్లలో శ్రీలీల నుంచి 12 సినిమాలొచ్చాయి. గతేడాది శ్రీలీల నటించిన సినిమాలు నాలుగు రిలీజ్ కాగా అందులో భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయింది. కానీ ఆ హిట్ బాలయ్య అకౌంట్ లో పడిపోయింది.
ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల ఆ సినిమా తో మంచి హిట్టే అందుకుంది. సినిమాలో అమ్మడు చేసిన డ్యాన్సులు ఓ రేంజ్ లో క్లిక్ అయ్యాయి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోనే శ్రీలీల డ్యాన్సుల గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిన శ్రీలీలకు ఈ మధ్య ఫ్లాపులెక్కువవుతున్నాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కు జోడీగా నటిస్తున్న శ్రీలీల.. వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లు ఇటీవలే తెలిపింది. వీటిలో ఏ ఒక్క సినిమా హిట్టయినా శ్రీలీల క్రేజ్ కొనసాగడం ఖాయం.













