అలాంటివి చేయనంటున్న శ్రీలీల
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శ్రీలీల, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబుతో అమ్మడు చేసిన గుంటూరు కారం సినిమా హిట్ అయితే శ్రీలీల కెరీర్ తర్వాతి స్థాయికి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎలా అయినా సరే ప్రస్తుతం అమ్మడు ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం చూస్తే తన డేట్స్ మరో రెండేళ్ల వరకు ఖాళీగా లేవు. ఓ వైపు సినిమాలు, మరో వైపు చదువు, ఇంకో వైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేస్తూ తెగ బిజీగా ఉంటుంది శ్రీలీల. ఇప్పటికే ఆమె చేతిలో ఆరుకు పైగా బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఆఫర్లు కూడా అమ్మడు వెంట క్యూ కడుతున్నాయి.
కానీ వచ్చిన ప్రతీ ఆఫర్ ను అందుకోకుండా, యాడ్స్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుందట శ్రీలీల. రీసెంట్ గా శ్రీలీలకు ఓ ఆల్కహాల్ బ్రాండ్, ఓ బెట్టింగ్ యాప్ నుంచి ఆఫర్లు రాగా వాటిని చేయనని మొహం మీదే చెప్పేసిందట. జనాలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేయకూడదని ముందే తనకు తాను ఓ రూల్ పెట్టుకుందట శ్రీలీల. అందుకే రెమ్యూనరేషన్ ఎంత ఆఫర్ చేసినా సరే అలాంటి యాడ్స్‌కు దూరంగా ఉంటుందట. శ్రీలీల నిర్ణయానికి నెటిజన్లు అమ్మడుని తెగ ప్రశంసిస్తున్నారు.













