విషమించిన బాలు ఆరోగ్యం…
అనారోగ్యంతో చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా మారింది. నిజానికి గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుందని, ఫిజియోథెరపీ చేస్తున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెప్పడంతో బాలు కి ఉన్న అశేషాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన గురువారం తిరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో బాలు ఆరోగ్యం గురించి వచ్చిన కొన్ని తప్పుడు వార్తల తరహాలో ఇదీ కావాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలియాలని వారంతా ప్రార్ధనలు చేశారు. అయితే ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రి సాయంత్రం 6.30గంటల సమయంలో విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్పీబీ అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు. కరోనా బారిన పడి గత ఆగస్టు 5 న ఎంజిఎం ఆసుపత్రిలో జేరిన ఎస్పీ బాలు…దేశంలోనే మరెవరూ తీసుకోనంత అత్యధిక సమయం అంటే దాదాపు 40 రోజుల పాటు బాలు ఎక్మో చికిత్స తీసుకున్నారు. తొలి దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు ఎక్మో పై చికిత్స అందించారు. ఆ తర్వాత తర్వాత ఆయన నిదానంగా కోలుకున్నారు. కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బాలు కరోనా నెగిటివ్ అని తెలిసిన అభిమానులు ఇక ఏ భయమూ లేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19 నుంచి బాలు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్స్ కూడా ఆగిపోవడంతో.. ఇక ఆయన పూర్తిగా కోలుకున్నట్టే అందరూ భావించారు. నేడో, రేపో నాన్న డిశ్చార్జ్ అవడం మాత్రమే మిగిలి ఉందని బాలు తనయుడు చరణ్ సైతం చెప్పారు. ఈ నేపధ్యంలో అకస్మాత్తుగా బాల సుబ్రహ్మణ్యం ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురవడం, దగ్గర బంధువులు అందరూ హుటాహుటిన ఆసుపత్రికి తరలుతుండడం వంటి వార్తలతో అభిమానుల్లో భయాందోళనలు కలుగుతున్నాయి.













