అందుకే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడు.. ఒకే ఒక్కడు!
చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గాయకులు తమ గానామృతంతో ప్రజల మనసులు దోచుకున్నవారే. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు కొత్త సింగర్స్ వస్తూనే ఉన్నారు, కనుమరుగవుతూనే ఉన్నారు. కానీ, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అనేవాడు ఒక్కడే. అంటే ఒకే ఒక్కడు. ఇక అలాంటి సింగర్ మానవాళి ఉన్నంతవరకు పుట్టడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. వివిధ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. బాలు ప్రజలకు ఎంత దగ్గరయ్యాడు అంటే అతను ఇకలేడు అనే విషయాన్ని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో బాలు స్వరం వినని తెలుగువారు ఉండరు. ఇది నిజం. భౌతికంగా బాలు మనకు దూరమైనా తన స్వరంతో నిత్యం పలకరిస్తూనే ఉంటాడు.
1966 డిసెంబర్ 15న `శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న` చిత్రంలోని `ఏమి ఈ వింత మోహం..` పాటతో నేపథ్య గాయకుడిగా సినీ రంగంలో ప్రవేశించాడు బాలు. పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, కె.రఘురామయ్యతో కలిసి ఈ పాటను పాడారు బాలు.
తెలుగులో బాలు పాడిన చివరి పాట రవితేజ హీరోగా నటించిన `డిస్కోరాజా` చిత్రంలోని `నువ్వునాతో ఏమన్నావో.. నేనేం విన్నానో` అనే పాట. ఈ పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట కంటే ముందు `పలాస 1978`లోని `ఓ సొగసరి` అనే పాటను పాడారు. అయితే ఈ సినిమా డిస్కోరాజా తర్వాత విడుదలైంది. తమిళ్లో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న `అన్నాత్తై` చిత్రంలో ఒక పాట పాడారు బాలు. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
1966లో ప్రారంభమైన బాలు పాటల ప్రస్థానం 54 సంవ్సరాల పాటు నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగింది. ఒక సింగర్ తన కెరీర్లో 40,000 పాటలు పాడడం అనేది మామూలు విషయం కాదు. అది ఎవ్వరికీ సాధ్యం అవదు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో బాలుకి స్థానం కల్పించి గౌరవించారు. 54 సంవత్సరాల్లో రోజుకి ఒక పాట పాడినా 20,000 దాటదు. కానీ, బాలు 40,000 పాటలు పాడాడంటే అర్థం చేసుకోవచ్చు ప్రతి రోజూ ఎంత బిజీగా ఉండేవాడో. ఆయన కెరీర్లో ఒకేరోజు 10 పాటలు పాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు భాషల్లో పాటలు పాడే సింగర్స్ రోజుకి ఒక పాటకు మించి పాడలేని పరిస్థితి ఉంది. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆరోజుల్లోనే ఏకధాటిగా పాటలు పాడడం ఒక్క బాలు వల్లే అయ్యింది. అందుకే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడు… ఒకే ఒక్కడు.













