ఇప్పటికీ విషమంగానే బాలు ఆరోగ్య పరిస్థితి.. ఆయన కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రార్థనలు
కరోనా బారిన పడిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గత కొంతకాలంలో చెన్నయ్‌లోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ యాజమాన్యం ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూనే ఉంది. ఆమధ్య బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, కరోనా నుంచి కోలుకుంటున్నారని వార్తలు వచ్చాయి. బాలు ఆరోగ్యం గురించి ఆయన కుమారుడు చరణ్, సోదరి శైలజ వీడియోలు కూడా విడుదల చేశారు. తాజాగా హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నట్టు తెలుస్తోంది. బాలు వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులెటన్ వల్ల తెలుస్తోంది. ఆయనకు ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ అందిస్తున్నారు వైద్యులు. అంతేకాకుండా ఈసీఎంఓ (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. హార్ట్ అండ్ లంగ్స్ బైపాస్ కింద పనిచేసేలా ఈ ప్రక్రియ ఉంటుంది. కృత్రిమ ఊపితిత్తుల ద్వారా రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. దీనివల్ల వైద్యులు అందించే చికిత్సకు శరీరం సహకరిస్తుంది. ప్రస్తుతం బాలుకి అందిస్తున్న చికిత్సను చూస్తుంటే పరిస్థితి విషమంగానే ఉన్నట్టు అర్థమవుతోంది.
బాలు పరిస్థితి తెలుసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన ఆరోగ్యంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. మా బాలు త్వరగా కోలుకొని రావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ బాలు ఆరోగ్య పరిస్థితిపై ఎక్కువ ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్, కమల్‌హాసన్, భారతీరాజా, ఇళయరాజా, రెహమాన్లతోపాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఎంతో మంది ప్రముఖులు బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని, మనందరికీ తన గానామృతాన్ని పంచాలని మనమూ కోరుకుందాం.













