రజనీకాంత్ కుమార్తెకు విడాకులు మంజూరు
సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్యకు విడాకులు మంజూరయ్యాయి. 2010లో చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త అశ్విన్‌తో సౌందర్యకు వివాహం జరగ్గా, వారికి ఓ కుమారుడు పుట్టాడు. అయితే ఆ తరువాత ఇరువురి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకోవడంతో విడాకుల కోసం గతేడాది డిసెంబర్లో చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆరు నెలల తప్పనిసరి గడువు విధించగా, ఆ గడువు కూడా పూర్తవడంతో కొన్ని రోజుల క్రితమే కోర్టుకు హాజరై విడిపోయేందుకు సమ్మతమేనని సౌందర్య, అశ్విన్‌లు కోర్టుకు నివేదించారు. ఈ విషయమై ప్యామిలీ కోర్టు తీర్పునిస్తూ, సౌందర్య, అశ్విన్‌లకు విడాకులు మంజూరు చేసింది. కుమారుడు వేద్ తల్లి వద్దే ఉండేవిధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, సౌందర్య ప్రస్తుతం వీఐపీ2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.













