సోనూ సూద్ ధాటికి తగ్గిన అమితాబ్, అక్షయ్
ప్రపంచం మునుపెన్నడూ చూడని విపత్తుని చూస్తోంది. కలలో కూడా ఊహించని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా జనాభా ఎక్కువ వున్న భారత్‌లాంటి దేశంలో ఇలాంటి పరిస్ఙతుల్లో సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి. ఎప్పుడైతే లాక్డౌన్ మొదలైందో అప్పటి నుంచీ దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎంతో బాధాకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేస్తున్నారు. కొందరు డబ్బు రూపంలో, కొందరు వస్తు రూపంలో, మరికొందరు సేవ చేయడం ద్వారా తమ సేవా నిరతిని చాటుకుంటున్నారు. వీరందరిదీ ఒక దారైతే, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ది మరో దారి. దేశంలోని పలు భాషా చిత్రాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు చేసిన సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. ఈమధ్య జరిగిన తాజా పరిణామాలతో రియల్ హీరో సోనూ సూద్ అనే పేరు తెచ్చుకున్నాడు.
లాక్డౌన్ సమయంలో వేలాది మంది ఆహారం అందించడంతోపాటు వేల మంది వలస కూలీలను వందల బస్సుల్లో వారి స్వస్థలాలకు చేరుస్తున్నాడు. అంతేకాదు తన సొంత హోటల్‌ను కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఉచితంగా అందించాడు. గత కొన్ని రోజులుగా లక్షల రూపాయలు ఖర్చుచేస్తూ పూర్తిగా ప్రజాసేవకే అంకితమయ్యాడు సోనూ సూద్. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ సంస్థ ఒక సర్వేను నిర్వహించింది. ప్రస్తుతం దేశం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసిన వారిలో ఎవరు బెస్ట్ అనేది తేల్చి చెప్పడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా నిర్వహించిన సర్వేలో సోనూ సూద్ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. హీరో అక్షయ్‌కుమార్ కూడా సేవా కార్యక్రమాలు బాగానే చేస్తాడు. వివిధ రకాల సేవలతో అక్షయ్ ఎప్పుడూ ముందుంటాడు. అలాగే అమితాబ్ కూడా తన వంతు సాయం అందిస్తూనే ఉంటాడు. అయితే ఈ సర్వే వల్ల అక్షయ్‌కుమార్ రెండో స్థానం, అమితాబ్ బచ్చన్ మూడో స్థానంలో నిలిచారు. ప్రజాసేవే పరమావధిగా భావించి తన వంతుగా సేవలు అందిస్తున్న సోనూసూద్‌కు ప్రభుత్వం తరఫున గౌరవం అందాలని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు సర్వే కూడా సోనూకే మొదటి స్థానం ఇవ్వడంతో ప్రభుత్వం సోనూ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉందనే వాదన బాగా పెరిగింది.













